దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటోంది

అందుకే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతోంది : ఇండియా టుడే కాంక్లేవ్‌ -25లో సీఎం రేవంత్‌ రెడ్డి;

Advertisement
Update:2025-03-07 23:04 IST

దక్షిణాది రాష్ట్రాలపై నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్‌ లో ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ప్రీతి చౌదరి సహా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌ పై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి, సంక్షేం, సుపరిపాలన.. ఈ మూడింటిలో సమ్మిళిత విధానం కొనసాగించడమే తెలంగాణ మోడల్‌ అన్నారు. హైదరాబాద్‌ దేశంలోని ముంబై, బెంగళూరు, ఢిల్లీ నగరాలతో పోటీ పడటం కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ న్యూయార్క్‌, సియోల్‌, టోక్యోలాంటి నగరాలతో పోటీ పడుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రానిది టెస్ట్ మ్యాచ్ మాడల్ అయితే, తెలంగాణది ట్వంటీ ట్వంటీ మాడల్ అన్నారు. “30 వేల ఎకరాల్లో అంతర్జాతీయస్థాయి అత్యంత అద్భుతమైన ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశాం. అయిదు సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరాన్ని చూడండి. తెలంగాణ మాడల్‌తో ఎవరూ పోటీ పడలేరు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరోజులో సాధ్యమైంది కాదు. కుతుబ్ షాహీ కాలం నుంచి ఈ నగరానికి 450 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి..'' అని వివరించారు.

పెట్టుబడుల విషయంలో గుజరాత్ తరహాలోనే దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మిగతా రాష్ట్రాలకు కూడా రాయితీలు ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై నమ్మకం ఉంచినందున రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అడగటం తమ బాధ్యత అన్నారు. తెలంగాణకు రూ.7 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 69 కోట్లు మాత్రమే అప్పులుండేవన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు మాత్రమేనన్నారు. జీతాలకు, అప్పులపై అసలు వడ్డీలకే రూ.13 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కనీసం నెలకు 500 కోట్లు కేటాయించలేని పరిస్థితులున్నాయి. ఇలాంటి అంశాలపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. 2026 లో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టడానికి ముందు అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకోవాలి. దీనిపై ముందు చర్చ జరగాలి. రాజకీయ కోణంలో దక్షిణాదికి నష్టం జరిగే నిర్ణయాలు సరికాదన్నారు.

దేశంలో కులగణన ఎందుకు జరగకూడదో చెప్పాలన్నారు. ''కుల గణనలో తప్పేముంది. బీసీల జనాభాను ఎందుకు లెక్కించకూడదు. ఎస్సీ, ఎస్టీ లెక్కలు తేల్చినట్టుగానే బీసీల గణాంకాలు సేకరించడంలో ఇబ్బందేంటి. వారి డిమాండ్ సమంజసమైనప్పుడు బీసీ జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లు కల్పించడంలో తప్పేముంది. ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు. ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు. హిందీ నేర్చుకోవడమన్నది ఒక ఐచ్చికంగా మాత్రమే ఉండాలి. బలవంతంగా రుద్దకూడదు. కాలేజీల్లో ఫ్రెంచ్, జర్మనీ వంటి ఎన్నో భాషలు ఉన్నాయి. ఎవరికి ఏదిష్టముంటే దాన్ని నేర్చుకుంటారు. హిందీని నేర్చుకోవడాన్ని వ్యతిరేకించడం లేదు. బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించవద్దనేదే మా అభిప్రాయం. హిందీ నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఉందంటే నేర్చుకుంటారు. హైదరాబాద్ వేదికగా ఒలంపిక్ క్రీడలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశాం. క్రీడలకు హైదరాబాద్ ఒక మంచి కేంద్రం. ప్రపంచ మిలటరీ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ హైదరాబాద్‌లో నిర్వహించాం. ఎంతో మంది ప్రపంచ స్థాయి క్రీడాకారులు తెలంగాణ నుంచి ఉన్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఏది ఉత్తమమైన నగరమో అంతర్జాతీయ ఒలింపిక్ అసోషియేషన్ నిర్ణయించాలి.” అని రేవంత్‌ అన్నారు.

Tags:    
Advertisement

Similar News