దక్షిణాదిపై 'గుజరాత్' పడగ !!

ఉత్తరాదిలో బీజేపీ ప్రభంజనం గుజరాత్ ఫలితాలతో మరోసారి రుజువయ్యింది. ఇక దక్షిణాదిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలను ఎట్లా కైవసం చేసుకోవాలన్న అంశంపై ఆ పార్టీ భారీ కసరత్తు చేస్తున్నది. అందులో తెలంగాణ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది.

Advertisement
Update:2022-12-09 07:59 IST

''మీరు మోదీని అర్థం చేసుకోకపోతే, ఆయన బలాన్ని అర్థం చేసుకోలేరు. ఆయన్ను ఓడించడానికి మీరు వ్యూహం రచించలేరు. ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నందున ఆయనను ఓడిస్తారని కాంగ్రెస్ నేతలు భ్రమపడవద్దు. ప్రజలు బీజేపీని తరిమేస్తారని రాహుల్‌ గాంధీ అనుకుంటున్నారు. కానీ, అది జరగదు'' అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ గత ఏప్రిల్ లో వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజం. మోడీ బలాన్ని సమగ్రంగా అధ్యయనం చేయవలసి ఉన్నది. టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా ఈ పనిలో ఉన్నారు. మోడీ మెడలు వంచడమెలా అన్న అంశంపై ఆయన సుదీర్ఘ పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఉత్తరాదిలో బీజేపీ ప్రభంజనం గుజరాత్ ఫలితాలతో మరోసారి రుజువయ్యింది. ఇక దక్షిణాదిలో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలను ఎట్లా కైవసం చేసుకోవాలన్న అంశంపై ఆ పార్టీ భారీ కసరత్తు చేస్తున్నది. అందులో తెలంగాణ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. తెలంగాణ రాజకీయ పరిణామాలను మోడీ, అమిత్ షా ద్వయం ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తున్నారో చెప్పడానికి చాలా ఉదాహరణలున్నవి. వైఎస్.షర్మిలకు ప్రధాని మోడీ ఫోనులో పరామర్శించిన సమాచారంలో నిజానిజాలు పక్కన బెడితే, కేసీఆర్ తో తలపడే క్రమంలో అంది వచ్చే ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. షర్మిలను గడ్డిపరకతో పోల్చడం సరికాదేమో కానీ, ఆమె బలమేమిటో నిర్ధారణ కాకపోయినా కేసీఆర్ ను ప్రతిఘటిస్తున్న తీరు వల్ల షర్మిల పట్ల బీజేపీ అగ్రనాయకత్వం ఆసక్తిని కనబరుస్తున్నది కావచ్చు.

''శత్రువు అవశేషాలు కూడా రోగం, నిప్పు అవశేషాల్లాగే మళ్ళీ తలెత్తుతాయి. అందుకే వాటిని పూర్తిగా నాశనం చెయ్యాలి. శత్రువు బలహీన పడ్డాడని అశ్రద్ధ చేయవద్దు. గడ్డివాములో పడిన నిప్పురవ్వ వలె కొంతకాలానికి అతను చాలా ప్రమాదకరంగా మారతాడు'' అని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దపు భారత తత్వవేత్త కౌటిల్యుడు అన్నాడు. సరిగ్గా కౌటిల్యుని ఫార్ములాను బీజేపీ అనుసరిస్తోంది. జాతీయ స్థాయిలో అసలే చితికిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇంకా ఎంత 'చితగ్గొడుతున్నదో' చూస్తున్నాం. గుజరాత్ లో కాంగ్రెస్ ఘోర పరాజయం వెనుక 'ఆప్' వాటా కూడా ఉండడం మన దేశ రాజకీయ రంగస్థలంపై కనిపిస్తున్న ఒక విషాదం.'ఆప్'కు ప్రధాన శత్రువు కాంగ్రెస్సా? బిజెపియా? అనే ప్రశ్నలకు జవాబు కేజ్రీవాల్ చెప్పవలసి ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించకూడదా? అని అడిగే వాళ్ళుంటారు. కానీ మతతత్వ బీజేపీకి 'పరోక్షంగా' లాభం చేకూర్చే కార్యకలాపాలపై సమీక్ష అవసరం.

బీజేపీ తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 27 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పటికే టార్గెట్ చేస్తోంది. గడచిన జూలై 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినప్పుడే కేసీఆర్ తో 'యుద్దానికి' సంబంధించిన బ్లూ ప్రింట్ తయారయినట్టు చాలామంది నమ్ముతున్నారు. 'సాలు దొర.. సెలవు దొర' అంటూ బీజేపీ, 'సాలు మోదీ, సంపకు మోదీ' అని టీఆర్ఎస్ ప్రకటనలు, హోర్డింగులు, పోస్టర్లు ముంచెత్తాయి. ఈ స్థాయి పోస్టర్ల వార్ రెండు రాజకీయ ప్రత్యర్థి పార్టీల మధ్య ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ తొలి 40 ఏళ్లలాగా బీజేపీ పాతుకుపోతుందని, బీజేపీ ఎక్కడికీ పోదని కొంతమంది అంటున్నారు. జాతీయ స్థాయిలో 30 శాతం ఓటింగ్ తెచ్చుకున్న బీజేపీ అంత త్వరగా ఉనికి కోల్పోయే అవకాశాలు లేవు. ఒక వేళ మోదీని పక్కకు పెట్టినా బీజేపీ సుస్థిరంగానే ఉంటుందన్న విశ్లేషణ ఉన్నది. కాంగ్రెస్ బలహీనపడటంతో ఇతర పార్టీలు బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తున్నవి. 1/3వ వంతు ప్రజలు మాత్రమే బీజేపీకి ఓటు వేస్తున్న సంగతి తెలియనిది కాదు. మిగిలిన వాళ్ళంతా 10,12 లేదా 15 రాజకీయపార్టీల వైపే అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ క్షీణించిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్ కు ఆదరణ బాగా కుంగిపోయిన కారణంగానే 65 శాతం మందికి పైగా ప్రాంతీయ పార్టీల వైపు,లేదా చిన్నా చితకా పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది.

2018 వరకూ రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను సవాలు చేసే శక్తిగా బీజేపీ ఎదుగుతుందని బీజేపీ నాయకులే నమ్మలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క నియోజకవర్గం గోషామహల్ లో రాజాసింగ్ గెలిచారు.103 సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. 2019 లోక్ సభ ఎన్నికలు బీజేపీలో ఆ నమ్మకాన్ని కలిగించాయి. లోక్ సభ ఎన్నికలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళితే మోడీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుందని అంచనా వేసిన తర్వాతే కేసీఆర్ దూరదృష్టితో 'ముందస్తు' ఎన్నికలకు వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఆయన అంచనాలను నిజం చేశాయి. బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గట్టిగా దృష్టిపెడితే తెలంగాణపై జెండా ఎగురవేయడం కష్టం కాదని బీజేపీ ఒక అవగాహనకు వచ్చింది.

దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ ఫలితాలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో గట్టిపోటీ నివ్వడం బీజేపీలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. క్యాడర్ బలంగా లేనప్పుడు అభ్యర్థి ఇమేజ్ ముఖ్యమవుతుంది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు గెలుపునకు దోహదపడిన అంశమిదే!

అలాగే 'గెలవగలిగిన పార్టీ' అనే ఇమేజ్ ను సృష్టించడానికి ఆ పార్టీ అనేక వ్యూహాలను రచిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌లో అందరినీ కలుపుకొనిపోయే నాయకత్వం కొరత బీజేపీకి ఒక అనుకూల అంశం. టీఆర్ఎస్ పట్ల అసంతృప్తి ఉన్న వారందిరనీ తమ వైపునకు తిప్పుకోవడానికి మళ్లించడానికి బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రయతిస్తున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించిన బీజేపీ దళారులు మొయినాబాద్ ఫార్మ్ హౌజ్ లో పట్టుబడడంతో 'ఢిల్లీ ప్రణాళిక' భగ్నమైంది. కాంగ్రెస్ కు పోలింగ్ బూత్ స్థాయిలో క్యాడర్ ఉంది. కానీ 'నేనే అసలైన ప్రత్యర్థిని' అనే ఇమేజ్‌ను బీజేపీ ప్రజల్లోకి బలంగా పంపుతోంది.

తెలంగాణలో బీజేపీ బీసీలను కేంద్రంగా చేసుకొని అదనంగా దళితులను, రెడ్లను సమీకరించే పనిలో కూడా ఉంది. సోషల్ ఇంజనీరింగ్ చేయడానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. కాగా హిందుత్వవాదం, జాతీయవాదం, సంక్షేమం అనే మూడు అంశాలుగా ఎన్నికల వ్యూహరచన ఉంటుందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలని ప్రజలు నిర్ణయానికొచ్చినట్టు ప్రధాని మోడీ, అమిత్ షా పలు సందర్భాల్లో చెప్పారు.

2024 పార్లమెంట్ ఎన్నికలతో కలిపితే మోడీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశముందని 2018లో అంచనా వేసినట్టే గుజరాత్ ఫలితాల నేపథ్యంలో 'ముందస్తు' ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ వెనుకాడకపోచ్చునని కొందరు విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్ మనసులో ఏమున్నదో కనిపెట్టడం చాలా కష్టమే కాదు, అసంభవం కూడా.

టిఆర్ఎస్ శుక్రవారం నుంచి బిఆర్ఎస్ పేరిట జాతీయపార్టీగా అవతరిస్తుంది. జాతీయ రాజకీయాల్లో 'గుణాత్మక మార్పు' నినాదంతో కేసీఆర్ ముందుకెడుతున్నారు. సరే,జాతీయ పార్టీకి ఉండే సవాళ్లు ఎలాగూ ఉంటాయి. తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని టిఆర్ఎస్ నిర్మాత దృఢ సంకల్పంతో ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించనున్నట్టు ప్రకటించిన తర్వాతే కేసీఆర్ 'ముట్టడికి' బీజేపీ తన 'త్రిశూల' వ్యూహమైన ఐటీ, సీబీఐ, ఈడీలను దూకుడుగా ఉసిగొల్పుతోందని తెలంగాణ సమాజం గుర్తించింది. మోడీతో యుద్ధం చేయగల సత్తా, అందుకు అవసరమైన ప్రణాళికలు కేసీఆర్ కు మినహా మరొకరికి లేవని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొద్దీ రోజుల కిందట చేసిన వ్యాఖ్యలను తక్కువ అంచనా వేయలేం.

Tags:    
Advertisement

Similar News