రాష్ట్రపతి పోలీస్ పతకాలు.. తెలుగు రాష్ట్రాలకు చెరి రెండు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి అదనపు డీజీ అతుల్‌ సింగ్‌, 6వ బెటాలియన్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకట్రావు, తెలంగాణ నుంచి అదనపు డీజీ అనిల్‌ కుమార్‌, 12వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ బృంగి రామకృష్ణ రాష్ట్రపతి పతకాలు అందుకోబోతున్నారు.

Advertisement
Update:2023-01-25 20:50 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సైనిక, పోలీస్ అధికారులకు పతకాలను ప్రకటించింది. అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీస్ పతకాలకు (ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ) ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు, తెలంగాణకు చెందిన ఇద్దరు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అదనపు డీజీ అతుల్‌ సింగ్‌, 6వ బెటాలియన్‌ రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంగం వెంకట్రావు, తెలంగాణ నుంచి అదనపు డీజీ అనిల్‌ కుమార్‌, 12వ బెటాలియన్‌ అదనపు కమాండెంట్‌ బృంగి రామకృష్ణ రాష్ట్రపతి పతకాలు అందుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పోలీస్ పతకాలు మొత్తం 93మందికి ఇవ్వబోతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా 901 మందికి పోలీసు పతకాలు అందిస్తారు. 140 మందికి పోలీస్‌ మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ (పీఎంజీ), 93 మంది పోలీసులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు(పీపీఎం), 668 మందికి పోలీస్‌ విశిష్ట సేవా పతకాలు (పోలీసు మెడల్‌ ఫర్‌ మెరిటోరియస్‌ సర్వీస్‌) ప్రకటించారు.

గ్యాలంట్రీ పతకాలు దక్కించుకున్న 140 మందిలో 48 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 31 మంది, జమ్మూకాశ్మీర్‌ నుంచి 25, ఝార్ఖండ్‌ నుంచి 9, ఢిల్లీ నుంచి 7, ఛత్తీస్‌ గఢ్‌ నుంచి ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ పురస్కారాలు దక్కాయి. పోలీసు దళాలకు కూడా అత్యున్నత రాష్ట్రపతి పోలీసు మెడల్‌ ఫర్‌ గ్యాలంట్రీ పురస్కారం ప్రకటించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది పోలీసు దళాల్లో ఎవరికీ ఆ పురస్కారం ప్రకటించలేదు.

తెలుగు రాష్ట్రాల్లో

రిపబ్లిక్ డే పురస్కారాల్లో ఆంధప్రదేశ్‌ పోలీసులకు 17, తెలంగాణకు 15 పతకాలు దక్కాయి. ఏపీలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం, 15 మందికి విశిష్ట సేవా పతకాలు, తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు పతకం, 13 మందికి పోలీస్‌ విశిష్ట సేవాల పతకాలు ఇస్తారు. 

Tags:    
Advertisement

Similar News