ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కి కేంద్రం మంగళం..

2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది కేంద్రం. 1నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ లకు మంగళం పాడింది.

Advertisement
Update:2022-11-30 09:07 IST

పేరు గొప్ప పథకాలతో ఊరిస్తూ ప్రజల జీవన వ్యయం పెంచేసి తమాషా చూస్తున్న కేంద్రం తాజాగా విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇచ్చేందుకు వెనకగుడు వేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.దీంతో బడ్జెట్ లో ఆ మేరకు నిధుల కేటాయింపు ఆపేస్తుంది కేంద్రం. ఇప్పటివరకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్స్‌ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇచ్చేవారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులకు ఈ స్కాలర్‌ షిప్స్‌ ఇస్తారు. ఇకపై 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే స్కాలర్‌ షిప్స్‌ ఇస్తారు. మిగతా వారికి ఇచ్చే నిధుల్ని కేంద్రం మిగుల్చుకోవాలని చూస్తోంది.

ఎందుకు ఆపేస్తున్నామంటే..?

ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఆపేస్తున్న కేంద్రం, దానికి ఓ సాకు కూడా వెదికింది. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్య అందిస్తోంది కాబట్టి, 8వ తరగతి వరకు స్కాలర్‌ షిప్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు తాజాగా ప్రకటించాయి. ఇకపై 8వ తరగతి వరకు కేంద్రం అందించే స్కాలర్ షిప్ లు ఎవరికీ ఇవ్వడంలేదని తేల్చి చెప్పాయి.

కాంగ్రెస్ విమర్శలు..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చదువు దూరం చేసేందుకే కేంద్రం ఇలా కుట్రపన్నిందంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా. ఏడేళ్లుగా అమలులో ఉన్న ఈ పథకాన్ని ఇప్పుడు కుదించాల్సిని అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. ఉచిత నిర్బంధ విద్య అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ, అది కూడా సజావుగా సాగడం లేదని చెప్పారు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే 1నుంచి 8 తరగతుల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ అందకుండా చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.

Tags:    
Advertisement

Similar News