ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కే మా మద్దతు
ఇండియా కూటమిని ఏర్పాటు చేసే సమయంలో అన్నిపక్షాలు ఏం నిర్ణయం తీసుకున్నాయో వాటిని కాంగ్రెస్ మరోసారి గుర్తు చేసుకోవాలన్న అఖిలేష్
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య విభేదాలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. తామంతా లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కోరుకున్నామని.. అందుకే కూటమిని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి, కాంగ్రెస్‌కు మధ్య పోటీలా కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
ఇక్కడ ఆప్‌నకు బలం ఉన్నది కాబట్టి ఇండియా నేతలు ఆపార్టీకి మద్దతిస్తే బాగుటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కూటమిని ఏర్పాటు చేసే సమయంలో అన్నిపక్షాలు ఏం నిర్ణయం తీసుకున్నాయో వాటిని కాంగ్రెస్ మరోసారి గుర్తు చేసుకోవాలని కోరారు. తమ ప్రత్యర్థి అయిన బీజేపీని ఓడించడానికి అవకాశం ఉన్నచోట ప్రాంతీయపార్టీలకు తమ మద్దతు ఇవ్వాలని కూటమి నేతలు చేసుకున్న ఒప్పందం ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆప్ బలంగా ఉన్నది కాబట్టి తమ మద్దతు దానికేనని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ అఖిలేశ్ యాదవ్ మాటలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.