ఓట్ల కోసం జింకలా పరుగెడుతున్నఆతిశీ
ఢిల్లీ సీఎంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూడీ
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం మరింత హీటెక్కింది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం ఆతిశీపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రమేశ్ బిధూడీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నాలుగేళ్లగా ఢిల్లీ సమస్యలు పట్టించుకోని ఆతిశీ... ఎన్నికలు సమీపించిన వేళ ఓట్ల కోసం నగరవ్యాప్తంగా జింకలా పరుగెడుతున్నారని అన్నారు.
ఢిల్లీ ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగర వీధుల పరిస్థితి చూడండి. గడిచిన నాలుగేళ్లలో ఆతిశీ ఎప్పుడూ ఈ సమస్యలనుపట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అడవిలో జింకలా ఢిల్లీ వీధుల్లో ఆమె తిరుగుతున్నారు అని రమేశ్ బిధూడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆతిశీ ఇంటి పేరు మార్చుకున్నదని గతవారం కూడా వ్యాఖ్యలే చేసిన విషయం విదితమే.