ఒక్క పూటలో కోటిన్నర మంది 'అమృత్‌' స్నానం

రెండో రోజు వైభవంగా సాగుతున్నప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా

Advertisement
Update:2025-01-14 15:14 IST

ప్రయాగ్‌ రాజ్‌ త్రివేణి సంగమానికి రెండో రోజు భక్తులు పోటెత్తుతున్నారు. మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటిరోజే కోటి 65 లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా నేడు అఖాడాలు అమృత్‌ స్నాన్ ఆచరిస్తున్నారు. 10 వేల ఎకరాల కుంభనగర్‌ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది. స్నాన్‌ ఘాట్‌లన్నీ కిక్కిరిసిపోయాయి. ఉదయం 10 గంటలకే కోటి 38 లక్షల మందిపైగా అమృత్‌ స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారులు ప్రకటించారు.




 


అఖాడాల తొలి అమృత్‌ స్నాన్‌

ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళా రెండో రోజు వైభవంగా సాగుతున్నది. లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగ యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతం జన సంద్రంలా మారిపోయింది. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు తరలివస్తున్నారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు 'అమృత్‌ స్నాన్‌' చేశారు. తెల్లవారుజామునే 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో అమృత్‌ స్నానాలు ప్రారంభమయ్యాయి. శ్రీ పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శ్రీశంభు పంచాయతీ అటల్‌ అఖాడా, నిరంజని అఖాడా, ఆనంద్‌ అఖాడా మకర సంక్రాంతి వేళ తొలి అమృత్‌ స్నాన్‌ ఆచరించారు. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహా కుంభమేళాలో పాల్గొంటున్నాయి. అఖాడాల్లో ఎవరు ఎప్పుడు పుణ్య స్నానాలు చేయాలో వరుస క్రమంలో మహాకుంభ్‌ మేళా నిర్వహణ యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మకర సంక్రాంతి, వసంత పంచమి రోజున సన్నాతన ధర్మానికి చెంఇన 13 అఖాడాలు 'అమృత్‌ స్నాన్‌' చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలివచ్చారు. భక్తులకు వేరుగా, అఖాడాలకు వేరుగా స్నాన్‌ ఘాట్‌లను మహాకుంభమేళా అధికారులు ఏర్పాటు చేశారు.


 



144 ఏళ్లకోసారి వచ్చే ముహూర్తం!

సాధారణంగా 12 ఏళ్లకోసారి మహాకుంభమేళా జరుగుతుంది. కానీ గ్రహాల సంచారం ఆధారంగా గణిస్తే ప్రస్తుత కుంభమేళా 144 ఏళ్లకోసారి వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెబుతున్నారు. 'పుష్య పౌర్ణిమ' సందర్భంగా సోమవారం ప్రధాన స్నానం ఆచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత్‌ స్నానమని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, ప్రజలు ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తమ పాపాలన్నీ సమసిపోతాయనే విశ్వాసంతో భక్తులు, సాధువులు తరలివచ్చి స్నానాలు చేస్తున్నారు. ఎముకలు కొరికే చలి ఉన్నప్పటికీ భక్తులు గుంపులుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హర్‌హర్‌ మహాదేవ్‌, జై శ్రీరామ్‌, జై గంగామయ్యా అని నినదిస్తూ స్నానాలు చేస్తున్నారు.

కోటిన్నర మందికి పైగా

మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి కోటి 60 లక్షల మందికి పైగా భక్తులు అమృత్‌ స్నానాలు ఆచరించినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు. అమృత్‌ స్నాన్‌ చాలా శాంతియుతంగా జరుగుతున్నది యూపీ డీజీపీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. తమ అధికారులు, జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఈసారి భద్రత కోసం సీసీటీవీలు, డ్రోన్లు, అండర్‌ వాటర్‌ డ్రోన్లు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.




 


ఇది మన శాశ్వతమైన సంస్కృతి, విశ్వాసానికి సజీవ రూపం

కుంభమేళాకు వస్తున్న భక్తులు, సాధువులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. ఇది మన శాశ్వతమైన సంస్కృతి, విశ్వాసానికి సజీవ రూపమని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మకర సంక్రాంతి శుభ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌ త్రివేణి సంగమంలో మొదటి అమృత్‌ స్నాన్‌ చేయడం ద్వారా పుణ్యఫలం సంపాదించుకున్న భక్తులకు అభినందనలు అని పోస్ట్‌ చేశారు. మొదటిరోజు కోటీ 75 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సీఎం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News