ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.
భారత దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆత్మలాంటిదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఏఐసీసీ కొత్త కార్యాలయం ఇందిరా భవన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన రోజునే భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిందంటూ మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. దేశ స్వాతంత్ర్యం గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని చెప్పారు. దేశంలో మన రాజ్యాంగ సిద్ధాంతం, ఆరెస్సెస్ భావజాలం మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. 1947లో మనకు స్వాతంత్ర్యం రాలేదని చెప్పి దేశ ప్రజలను మోహన్ భగవత్ అవమానించారని రాహుల్ అన్నారు.
బ్రిటీష్ వారిపై పోరాడిన మన యోధులను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటాన్ని ఆపాలని అన్నారు. ఈ కొత్త ప్రధాన కార్యాలయంలోని లైబ్రరీని డాక్టర్ మన్మోహన్ సింగ్ లైబ్రరీ అని పిలుస్తామని ఖర్గే ప్రకటించారు. త్యాగధనులు నిర్ణయించిన ఇదే ప్రాంతంలో ఈ భవనం నిర్మించబడటం చాలా సంతోషకరమైన విషయమని, 1952 డిసెంబర్ 31న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షత వహించిన సీడబ్ల్యూసీ సమావేశంలో దీని గురించి చర్చించినట్లు గుర్తు చేశారు. ఆ రోజు నెహ్రూ.. ఏఐసీసీ ఆఫీస్ భవనం కోసం స్థలం కొనుగోలు ప్రశ్నను కమిటీ పరిగణించింది.. ఇంద్రప్రస్థ ఎస్టేట్‌లో AICC ఆఫీస్ కోసం ఒక స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు." అని చెప్పినట్లు తెలిపారు.