రాజస్థాన్ విషయంలో బీజేపీ అసంతృప్తి.. కాంగ్రెస్ సేఫ్ గేమ్..
రాజస్థాన్ లో అసంతృప్త ఎమ్మెల్యేలను లాగేసుకుని అక్కడ కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టాలనుకున్న కమలదళం పాచిక పారలేదు. కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడింది. బీజేపీకి షాకిచ్చింది.
ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికలు, అశోక్ గెహ్లాట్ ఉబలాటం, రాజస్థాన్ లో సీఎం కుర్చీలాట.. ఇలా ఈ ఎపిసోడ్ వారం రోజులపాటు రసవత్తరంగా సాగింది. బీజేపీలో లేనిపోని ఆశల్ని రేకెత్తించింది. అసంతృప్త ఎమ్మెల్యేలను లాగేసుకుని అక్కడ కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టాలనుకున్న కమలదళం పాచిక పారలేదు. రాజస్థాన్ లో కాంగ్రెస్ సేఫ్ గేమ్ ఆడింది. క్రమశిక్షణ చర్యల పేరుతో అసంతృప్తిని మరింత రెచ్చగొట్టకుండా ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంది. దీంతో కాంగ్రెస్ లో రాజస్థాన్ సంక్షోభం ముగిసిపోయినట్టేనని అంటున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. సీఎం అశోక్ గెహ్లాట్ రాష్ట్ర కార్యక్రమాల్లో మళ్లీ కుదురుకున్నారు. తాజాగా గాంధీ నగర్ స్టేషన్లో రాయల్ ట్రైన్ ని ప్రారంభించారు.
ఆపరేషన్ కమలం రివర్స్..
ఇటీవల దేశవ్యాప్తంగా ఆపరేషన్ లోటస్ అనేది బాగా ఫేమస్ అయింది. ఢిల్లీ అసెంబ్లీని కేజ్రీవాల్ కాపాడుకోగలిగారు. జార్ఖండ్ లో కూడా ఆపరేషన్ కమలం విఫలప్రయోగంగానే మిగిలింది. ఆ తర్వాత పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యేలకు పాతిక కోట్ల ఎర వేసినా ఎవరూ చిక్కలేదు. అక్కడ సీఎం ముందస్తు బలపరీక్షకు సిద్ధం కావడంతో, గవర్నర్ తో డ్రామాలాడించి బీజేపీ పరువు పోగొట్టుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ లో మాత్రం బీజేపీకి అనుకోని అవకాశం దొరికినట్టయింది.
200 సీట్లు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 108, బీజేపీకి 71 సీట్లు ఉన్నాయి. ఇటీవల గెహ్లాట్, ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడే క్రమంలో 76మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సిద్ధం చేశారు. తర్వాతి సీఎంగా అధిష్టానం సచిన్ పైలట్ ని ఎంపిక చేయడాన్ని వారు వ్యతిరేకించారు. దీంతో అధిష్టానం తేరుకుంది. గెహ్లాట్ ని రాజస్థాన్ కే పరిమితం చేసింది. తిరుగుబాటుకి ప్లాన్ చేసిన వారెవరో కనిపెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ లో గోతికాడ నక్కలా మారింది బీజేపీ. అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడానికి ప్లాన్ వేసింది. కానీ కాంగ్రెస్ ముందు జాగ్రత్త పడటంతో ఎమ్మెల్యేలు చేజారిపోలేదు. ఈ తిరుగుబాటు ఎపిసోడ్ లో ఎమ్మెల్యేలపై సీరియస్ యాక్షన్ తీసుకోకుండానే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో బీజేపీకి ఛాన్స్ మిస్సైంది. లేకపోతే కర్నాటక, మహారాష్ట్ర బాటలోనే రాజస్థాన్ లో కూడా లుకలుకలతో అధికార మార్పిడి జరిగేది. ఇటీవలే గోవాలో దెబ్బ తగిలిన తర్వాత రాజస్థాన్ విషయంలో కాంగ్రెస్ కాస్త తెలివిగా వ్యవహరించిందనే చెప్పాలి.