తీస్తా సెతల్వాద్ కు బెయిల్ తిరస్కరించడానికి కారణం లేదన్న సుప్రీం కోర్టు
తీస్తా సెతల్వాద్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో నిన్న విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్, ఈ కేసులో బెయిల్ మంజూరు చేయకూడని నేరం ఏమీ లేదని అన్నారు. ఆమెను రెండునెలలుగా కస్టడీలో ఉంచడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గుజరాత్‌లో ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను రెండు నెలలకు పైగా కస్టడీలో ఉంచడంపై గురువారంనాడు సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ హైకోర్టు, ప్రభుత్వానికి జవాబు ఇవ్వడానికి ఆరు వారాల సమయం ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసులో బెయిల్ మంజూరు చేయకూడని నేరం ఏమీ లేదని, అందులోనూ ఆమె ఒక మహిళకు కూడా అని పేర్కొంది. సెతల్వాద్ రెండు నెలలకు పైగా జైలులో ఉన్నారని, ఇంకా ఎటువంటి ఛార్జిషీట్ దాఖలు చేయలేదని న్యాయమూర్తులు అన్నారు.
''సెతల్వాద్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చెప్పినదానికన్నా ఎక్కువ ఏమీ ఎఫ్ఐఆర్‌లో లేదు. ఆమె ఓ మహిళ . ఆమె బెయిలు పిటిషన్‌పై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇస్తూ, సమాధానం చెప్పడానికి ఆరు వారాల గడువు ఏ విధంగా ఇచ్చింది? ఓ మహిళ ఇలాంటి కేసులో ఉన్నట్లు, ప్రభుత్వానికి ఆరు వారాల గడువు ఇస్తూ హైకోర్టు నోటీసు ఇచ్చినట్లు గతంలో ఎప్పుడైనా ఉదాహరణ ఏమైనా ఉందా? అని ప్రధాన న్యాయ మూర్తి యుయు లలిత్ ప్రశ్నించారు.
ఆమెకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్ఐఆర్‌లో బెయిలు మంజూరు చేయడానికి వీల్లేనటువంటి నేరం ఏదీ లేదు. ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం, ఉగ్రవాద నిరోధక చట్టం వంటి వాటి క్రింద ఆరోపణలు నమోదు కాలేదు. ఆమెపై నమోదు చేసిన కేసులన్నీ సాధారణమైనవి, అందులోనూ బెయిల్ పొందడానికి ఆమెకు ఓ మహిళగా అర్హత ఉంది'' అని ఛీఫ్ జస్టిస్ అన్నారు.
ఈరోజు విచారణను వాయిదా వేయాలని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. "ఈ వాదనలన్నీ హైకోర్టులో చేయాలి, సుప్రీంకోర్టులో కాదు. అది నా ప్రాథమిక అభ్యంతరం" అని మెహతా అన్నారు.
శ్రీమతి సెతల్వాద్ తరపు న్యాయవాది, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఇలా అన్నారు: "నేను ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తున్నాను. సెతల్వాద్ ఫోర్జరీ చేసిన పత్రం ఏమిటో ఎఫ్‌ఐఆర్ వెల్లడించలేదు." అన్నారు.
వాదనల అనంతరం ధర్మాసనం ఆమె బెయిలు దరఖాస్తుపై శుక్రవారం తదుపరి విచారణ జరుగుతుందని ప్రకటించింది