మత చిచ్చు రగిలిస్తున్న 'ది కేరళ స్టోరీ'
'ది కేరళ స్టోరీ' సినిమాని వెంటనే నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మత సామరస్యాన్ని నాశనం చేసే ప్రయత్నం అదని విమర్శించారు కాంగ్రెస్, వామపక్షాల నేతలు.
కేరళపై RSS విషం చిమ్ముతోందంటూ మండిపడుతున్నాయి వివిధ రాజకీయ పక్షాలు. ది కేరళ స్టోరీ అనే సినిమా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ప్రోడక్ట్ అంటూ విమర్శలు చేస్తున్నాయి. కేరళలో మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఇలాంటి సినిమా తీశారని మండిపడ్డారు కేరళ సీఎం పినరయి విజయన్. అక్రమ మతమార్పిడులు, లవ్ జీహాద్, ఉగ్రవాదం కోణంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ కేరళలోని వామపక్షాలతో సహా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
'ది కేరళ స్టోరీ' సినిమాకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళ నుంచి ఇప్పటి వరకు 32వేల మంది మహిళలు తప్పిపోయారని, వారందరూ మత మార్పిడులకు గురయ్యారని ఈ సినిమాలో చూపించారు. వారు ఇస్లాంలో చేరి, ఐసిస్ తీవ్రవాదులుగా మారారంటూ వచ్చిన కథనాలు ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత తీవ్ర కలకలం రేగింది. ముస్లింలను సమాజం నుంచి వేరు చేసేలా ఈ సినిమా రూపొందించారని కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ అనేది సమాజంలో విషం చిమ్మడానికి లైసెన్స్ కాదని అన్నారాయన.
నిషేధించండి...
'ది కేరళ స్టోరీ' సినిమాని వెంటనే నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మత సామరస్యాన్ని నాశనం చేసే ప్రయత్నం అదని విమర్శించారు కాంగ్రెస్, వామపక్షాల నేతలు. ఈ సినిమా నిర్మాణం వెనక RSS ఉందని ఆరోపిస్తున్నారు. మత ఉద్రిక్తతలను పెంచేందుకే RSS ఇలాంటి ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. ఫేక్ కథనాలు, సినిమాల ద్వారా విభజన రాజకీయాలను వ్యాప్తి చేసేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని అన్నారు.