ఎంపాక్స్‌ కోవిడ్‌ కాదు.. దాని వ్యాప్తిని నియంత్రించొచ్చు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో పలు ఆస్పత్రులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది.

Advertisement
Update:2024-08-21 09:30 IST

ఎంపాక్స్‌ కోవిడ్‌ కాదని, దాని వ్యాప్తిని నియంత్రించొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. ప్రపంచ దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్న వేళ భయాందోళనలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు దీంతో కాస్త ఊరట చెందుతున్నారు. డబ్ల్యూహెచ్‌వోలో యూరప్‌ రీజనల్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న హాన్స్‌ క్లుగే తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎంపాక్స్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు, నిర్మూలించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని వ్యాఖ్యానించారు. దీనిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని, మనం ఈ వైరస్‌ను నియంత్రిస్తామా.. మరోసారి నిర్లక్ష్యం, భయం వైపు వెళ్తామా.. అనేది మన స్పందనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. రానున్న ఏళ్లలో ఐరోపాకు, ప్రపంచానికి ఇది మరో పరీక్షే అని ఆయన హెచ్చరించారు.

మంకీపాక్స్‌పై పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని నౌకాశ్రయాల దగ్గర కూడా నిఘా పెంచాలని, మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్న వారెవరైనా కనిపిస్తే వెంటనే తెలపాలని పేర్కొంది. మంకీపాక్స్‌ వైరస్‌ సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచేందుకు, చికిత్స చేసేందుకు వీలుగా దేశ రాజధాని ఢిల్లీలో పలు ఆస్పత్రులను ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ నోడల్‌ కేంద్రాలుగా తమ పరిధిలోని కొన్ని ఆస్ప‌త్రులను గుర్తించాలని పేర్కొంది.

రెండేళ్లలో 116 దేశాలకు విస్తరించిన వైరస్‌

ఎంపాక్స్‌ వైరస్‌ గత రెండేళ్ల కాలంలో 116 దేశాలకు విస్తరించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 99,176 కేసులు నమోదవగా, ఇటీవల కాంగోలో వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 15,600 కేసులు నమోదు కాగా 537 మరణాలు సంభవించాయి. భారత్‌లో 2022 నుంచి ఇప్పటివరకు 30 ఎంపాక్స్‌ కేసులు రికార్డయ్యాయి. 2024 మార్చిలో చివరి కేసు గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాత దేశంలో ఎటువంటి ఎంపాక్స్‌ కేసులు కొత్తగా నమోదు కాలేదని తెలిపింది. మరోపక్క పొరుగున ఉన్న పాకిస్థాన్‌లో నలుగురిలో ఈ వైరస్‌ను గుర్తించారు.

Tags:    
Advertisement

Similar News