సీమా హైదర్‌కు సినిమా ఛాన్స్

ఆమె ఏదో కోరుకొని ఈ దేశంలో అడుగు పెట్టింది.. మనం మరేదో ఊహించాం.. కానీ ఇప్పుడు ఇంకేదో జరుగుతోంది.

Advertisement
Update:2023-08-03 13:49 IST

పబ్జి ఆటలో పరిచయమై ప్రియుడిగా మారిన వ్యక్తి కోసం ఆమె దేశం దాటి వచ్చింది. కోరుకున్న వాడిని కలవడానికి నలుగురు పిల్లల్ని పట్టుకొని అక్రమ మార్గంలో భారత దేశంలో అడుగు పెట్టింది. వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. వార్తలలో నిలిచింది. ఇప్పుడు ఆమెకు మరో అద్భుతమైన ఛాన్స్ వచ్చింది. జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ బృందం మంగళవారం గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్న పాకిస్తానీ మహిళ సీమా హైదర్‌ను కలిసింది. ఉదయపూర్ టైలర్ కన్హయ్య లాల్‌ను ఇస్లామిక్ రాడికల్స్ హత్య ఆధారంగా వారి రాబోయే చిత్రం 'ఏ టైలర్ మర్డర్ స్టోరీ' కోసం ఆమెను ఆడిషన్ చేసింది.

విచిత్రం ఏంటంటే.. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఐఎస్‌ఐ ఏజెంట్‌గా అనుమానిస్తున్న సీమా హైదర్ ఈ సినిమాలో `రా` ఆఫీసర్‌గా నటించనున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్ లు ఆమెకు ఆడిషన్ నిర్వహించారు.



సీమా.. సచిన్ కోసం పాకిస్తాన్‌లో ఉన్న తన భర్తను విడిచిపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్ మీనా కొత్త ఇంటికి మారిన తర్వాత వారు ఎదుర్కొన్న ఇబ్బందులను వీడియో చూపించారు. ఆహారం, ఇతర అవసరమైన వస్తువుల కొరతను ఎదుర్కొంటున్నందున తాము జీవించడానికి చాలా కష్టపడుతున్నామని దంపతులు వీడియో లో పేర్కొన్నారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సినిమా అవకాశాన్ని తెచ్చి పెట్టింది.

అయితే భారత్ లో అక్రమంగా ప్రవేశించినందుకుగాను అరెస్ట్ అయిన సీమ ప్రస్తుతానికి బెయిల్ పై ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ నుంచి క్లీన్ చీట్ పొందిన తరువాతే ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

ఇక 'ఏ టైలర్ మర్డర్ స్టోరీ' అనే ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే కన్హయ్య లాల్ తేలీ ఒక హిందూ టైలర్. అతనిని జూన్ 28, 2022న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కస్టమర్లుగా వచ్చిన ఇద్దరు ముస్లిం వ్యక్తులు హత్య చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసినందుకు గానూ కన్హయ్య లాల్ తల నరికి చంపారు. ఇదంతా ఒక సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఆ తరువాత కన్హయ్య లాల్ హత్య మేమే చేసామంటూ నిందితులు ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ హత్య నేపథ్యంలోనే దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల బడ్జెట్‌ రూపొందుతున్న చిత్రం 'ఏ టైలర్ మర్డర్ స్టోరీ'.

Tags:    
Advertisement

Similar News