ఆ రెండు దేశాలకు వెళ్లొద్దు.. కేంద్రం వార్నింగ్..!
ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ ఆర్మీ టాప్ కమాండర్‌తో పాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు అక్కడున్న రాయబార కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది కేంద్రం.
ఇరాన్, ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఉన్న భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసమైతేనే బయటకు రావాలని సూచించింది విదేశాంగ శాఖ. డజన్ల కొద్ది క్రూయిజ్ మిస్సైల్స్, వందల కొద్ది డ్రోన్లతో ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇరాన్ ఆర్మీ టాప్ కమాండర్‌తో పాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, ఖతార్, ఇరాక్ విదేశాంగ శాఖ మంత్రులతో చర్చలు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఇజ్రాయెల్‌లోని తన ఎంబసీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను సైతం అమెరికా హెచ్చరించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.