రూ.250 కోట్ల విలువైన నిజాం బంగళా, ఆస్తులకు సీల్ వేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

ఈ బంగళా, భూమిని తొలుత ఓ పార్శీ లాయర్‌కు బ్రిటిషర్లు లీజుకు ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, 1952లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ప్రభుత్వం కేటాయించింది.

Advertisement
Update:2022-12-05 08:26 IST

నిజాం నవాబులకు చెందిన రూ. 250 కోట్ల విలువైన బంగళా, విశాలమైన భూమికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సీల్ వేసింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబళేశ్వరం హిల్ స్టేషన్‌లో ఈ ఖరీదైన ప్రాపర్టీ ఉన్నది. 15 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం, అందులో ఒక భారీ బంగళా ఉన్నాయి. ఈ ఆస్తులపై పలు వివాదాలు చోటు చేసుకోవడంతో ఆదివారం సతారా జిల్లా కలెక్టర్ రుచేశ్ జైవన్షి పోలీసుల సాయంతో సీల్ చేశారు.

హిల్ స్టేషన్‌లో ఉన్న ఈ ప్రాపర్టీ విషయంలో రెండు వర్గాల మధ్య సుదీర్ఘ కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇది ప్రభుత్వానికి చెందిన ఆస్తే అయినా.. గతంలో నిజాం నవాబుకు సుదీర్ఘ కాలం పాటు లీజుకు ఇచ్చారు. అయితే ఆస్తి విషయమై తరచూ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతుండటంతో శాంతి, భద్రతల సమస్య తలెత్తుతోంది. డిసెంబర్ 1న నిజాం వర్గీయులు కొంత మంది ఈ బంగళా, భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ మరో సారి ఘర్షణ వాతావరణ నెలకొన్నది. మహారాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్.. బంగళాతో పాటు పక్కన ఉన్న భూమిని సీజ్ చేశారు.

బంగళాను ఆనుకొని ఉన్న స్టాఫ్ క్వార్టర్స్‌లో కొంత మంది నివసిస్తున్నారు. వారిని వెంటనే ఖాళీ చేయమని ఆదేశించినట్లు కలెక్టర్ రుచేశ్ తెలిపారు. వాళ్లు ఖాళీ చేసిన తర్వాత బంగళా, స్టాఫ్ క్వార్టర్స్ మొత్తం సీల్ వేస్తామని, ఇకపై ఇతరులను ఎవరినీ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టనివ్వమని కలెక్టర్ స్పష్టం చేశారు.కలెక్టర్ చెప్పిన వివరాల మేరకు.. ఈ బంగళా, భూమిని తొలుత ఓ పార్శీ లాయర్‌కు బ్రిటిషర్లు లీజుకు ఇచ్చారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, 1952లో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు ప్రభుత్వం కేటాయించింది.

నిజాం నవాబు గతంలో రూ.59,47,797 మేర ఆదాయపు పన్ను శాఖకు బాకీ పడ్డారు. ఈ భారీ మొత్తాన్ని రాబట్టుకోవడానికి ఐటీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. బాకీ వసూలు అయ్యే వరకు ఈ ప్రాపర్టీని అమ్మడం, లీజుకు ఇవ్వడం, తనఖా పెట్టడాన్ని నిషేధించింది. ఇక మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వారసుడిగా మీర్ బర్కత్ అలీ ఈ ప్రాపర్టీపై హక్కులు కొనసాగించారు. అయితే 2003లో ఈ బంగళా, భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ఎవరి పేరు మీద లీజ్ లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది.

2005లో సదరు ఉత్తర్వులను ఉపసంహరించి, తిరిగి నిజాం నవాబుల లీజు కొనసాగించింది. ఇక 2006లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాపర్టీని దిలీప్ టక్కర్ అనే వ్యక్తి పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేసింది. అప్పటి నుంచి నిజాం వారసులు, దిలీప్ టక్కర్ మధ్య వివాదం నడుస్తున్నది. బంగళాను, భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఇరు వర్గాలు పదే పదే గొడవలకు దిగుతుండటం, ఉద్రిక్తలు చోటు చేసుకుంటుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. 

Tags:    
Advertisement

Similar News