రోగులందు వీఐపీ రోగులు వేరయా..! ఎయిమ్స్ లో కొత్త రచ్చ
భారత్ లో వీఐపీ కల్చర్ లేదని ప్రధాని మోదీ ఓవైపు చెబుతుంటే, మరోవైపు పార్లమెంట్ సభ్యులకు ఇలా వీఐపీ ట్రీట్ మెంట్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు స్పెషల్ ట్రీట్ మెంట్ లేఖపై మండిపడుతున్నాయి.
రోగాల్లో పేద, ధనిక తేడాలు లేవు కానీ, రోగుల్లో మాత్రం పేద, ధనిక భేదాలున్నాయి. ఆస్పత్రిలో చేరి అడిగినంత ఫీజు కట్టినవారికే సకాలంలో సరైన ట్రీట్ మెంట్ జరుగుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించే అవసరం ఉండదు కదా, ఇక్కడ వీఐపీలు ఎవరో ఎలా తెలుస్తుంది. దానికోసం ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ వీఐపీ కేటగిరీని సృష్టించింది. సిట్టింగ్ ఎంపీలను వీఐపీలుగా గుర్తిస్తూ ప్రత్యేక ట్రీట్ మెంట్ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విష సంస్కృతికి బీజం వేసింది.
సిట్టింగ్ ఎంపీలకు స్పెషల్ ట్రీట్ మెంట్..
ప్రాణాపాయంలో ఉన్న రోగి, సాధారణ జ్వరంతో వచ్చిన పార్లమెంట్ సభ్యుడు.. ఇద్దరూ ఒకేసారి ఆస్పత్రికి వస్తే ముందుగా సిట్టింగ్ ఎంపీకి బెడ్ కేటాయిస్తారు. ఈమేరకు సిట్టింగ్ ఎంపీలకు ప్రత్యేక ట్రీట్ మెంట్ ఉంటుందని ఎయిమ్స్ డైరెక్టర్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఔట్ పేషెంట్, అత్యవసర కన్సల్టేషన్, ఆస్పత్రిలో చేరికల కోసం ఎయిమ్స్ కి వచ్చే పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఎయిమ్స్ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. లోక్ సభ జాయింట్ సెక్రెటరీకి ఆయన ఓ లేఖ కూడా రాశారు. ఎవరైనా సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడికి స్పెషాలిటీ విభాగంలో కన్సల్టేషన్ అవసరమైతే, ఎంపీ వ్యక్తిగత సిబ్బంది.. ఎయిమ్స్ డ్యూటీ ఆఫీసర్ ని సంప్రదించాలని ఆ లేఖలో కోరారు. దీనికోసం ఎయిమ్స్ లో కంట్రోల్ రూమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ లేఖపై ఇప్పుడు తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఎయిమ్స్ లో వీఐపీ కల్చర్ ఏంటని నిలదీస్తున్నారు వైద్య సంఘాల నేతలు. రోగుల్లో వీఐపీ సంస్కృతిని ఖండిస్తున్నామని తెలిపారు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు. ఇతరులకు ప్రయోజనం చేకూర్చే క్రమంలో ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకూడదని వారు అంటున్నారు. భారత్ లో వీఐపీ కల్చర్ లేదని ప్రధాని మోదీ ఓవైపు చెబుతుంటే, మరోవైపు పార్లమెంట్ సభ్యులకు ఇలా వీఐపీ ట్రీట్ మెంట్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైద్య సంఘాలు ఈ స్పెషల్ ట్రీట్ మెంట్ లేఖపై మండిపడుతున్నాయి.