కుక్కలే అతని సైన్యం.. పోలీసులనే కరిచేలా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చిన డ్రగ్ డీలర్

తానొక డాగ్ ట్రైనర్ అని చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్న నిందితుడు ఆ ముసుగులో డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడు. పోలీస్ డ్ర‌స్ వేసుకున్న వారిని మాత్ర‌మే కరిచేలా ఆ కుక్కలకు నిందితుడు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు.

Advertisement
Update:2023-09-26 12:04 IST

ఎరుపు రంగు దుస్తులు ధరించిన వారిపై ఎద్దులు దాడి చేయడం మనకి తెలిసిందే. అయితే కేరళలో ఖాకీ దుస్తులు ధరించిన వారిపై కుక్కలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న నిందితుడి ఇంటికి వెళ్లిన యాంటీ నార్కోటిక్స్ బృందంపై శిక్షణ పొందిన 13 కుక్కలు అతి దారుణంగా దాడిచేశాయి. కుక్కల నుంచి పోలీసులు తప్పించుకొనేలోపు నిందితుడు పరారయ్యారు.

వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ విక్రయం, అక్రమ రవాణా ఆరోపణలతో కేరళ పోలీసు బృందం కొట్టాయంలో స్మగ్లర్ల రహస్య స్థావరాన్ని త‌నిఖీ చేసేందుకు వెళ్లారు. ఆదివారం రాత్రి ఘటనా స్థలం వద్దకు పోలీసు బృందం అక్కడ అడుగు పెట్టగానే ఒకేసారి డజన్‌కు పైగా కుక్కలు దాడి చేశాయి. ప్రత్యేకంగా పోలీసు డ్రెస్ వేసుకుని వచ్చిన వారిపై మాత్రమే దాడి చేశాయి. పోలీసులు కుక్కల నుంచి త‌ప్పించుకునే సమయాన్ని ఉపయోగించుకొని నిందితుడు పరారయ్యాడు. అతని ఇంట్లో సోదాలు చేసి 17 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కొట్టాయం పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

తానొక డాగ్ ట్రైనర్ అని చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్న నిందితుడు ఆ ముసుగులో డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడు. పోలీస్ డ్ర‌స్ వేసుకున్న వారిని మాత్ర‌మే కరిచేలా ఆ కుక్కలకు నిందితుడు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుసుకొని పోలీసులు షాక్ అయ్యారు. అతడి పెంపుడు కుక్కలే కాకుండా చుట్టుపక్కల నుంచి వచ్చిన కుక్కలు కూడా ప్రత్యేకంగా పోలీసులను మాత్రమే అటాక్ చేసిన్నట్టు గుర్తించారు. అయితే కుక్కలకు ఎలా శిక్షణ ఇవ్వాలనేదానిపై రిటైర్డ్ బీఎస్ఎఫ్ ఆఫీసర్ వద్ద నిందితుడు ట్రైనింగ్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రత్యేకంగా పోలీసులను గాయపరచడం ఎలా అనే ప్రశ్న అడిగినందుకు పోలీసు అధికారి అతనిని బయటకు పంపేసినట్టు సమాచారం. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ డ్రగ్ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News