ఢిల్లీ, హైదరాబాద్‌లో మళ్లీ ఈడీ దాడులు.. సీరియస్ అయిన కేజ్రివాల్
లిక్కర్ పాలసీ విషయంలో గత మూడు నెలలుగా 500 సార్లు దాడులు చేశారు. దాదాపు 300 మంది సీబీఐ, ఈడీ అధికారులు 24 గంటల పాటు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంత వరకు మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయారు.
ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీకి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ, హైదరాబాద్, చండీగర్ నగరాల్లోని 35 ప్రదేశాల్లో ఈడీ దాడులు చేస్తోంది. లిక్కర్ పాలసీతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో శుక్రవారం ఉదయం నుంచే ఈ దాడులు కొనసాగుతున్నాయి. వెండర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ఈ పాలసీకి మధ్యవర్తులుగా వ్యవహరించిన పలువురు లిక్కర్ వ్యాపారస్తుల ఇళ్లలో దాడులు చేస్తున్నారు. కాగా, ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఈ లిక్కర్ పాలసీని రద్దు చేసింది.
ఇండోస్పిరిట్‌కు చెందిన సమీర్ మహేంద్రును ఈడీ అరెస్టు చేసిన కొన్ని రోజులకే లిక్కర్ పాలసీలో అనేక అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. దీంతో దేశవ్యాప్తంగా 75 ప్రదేశాల్లో ఈడీ దాడులు చేసింది. సీబీఐ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యునికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్‌ను అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఢిల్లీ డిప్యూటి చీఫ్ మినిస్టర్ మనీశ్ సిసోడియాతో సహా మరో 14 మందిపై ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.
తాజా ఈడీ దాడులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఫైర్ అయ్యారు. లిక్కర్ పాలసీ విషయంలో గత మూడు నెలలుగా 500 సార్లు దాడులు చేశారు. దాదాపు 300 మంది సీబీఐ, ఈడీ అధికారులు 24 గంటల పాటు దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంత వరకు మనీశ్ సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా సంపాదించలేకపోయారు. ఎందుకంటే అసలు లిక్కర్ పాలసీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు కాబట్టే. అనేక మంది అధికారుల విలువైన సమయాన్ని ఈ చెడ రాజకీయ కారణంగా వృథా చేశారు. ఇలాగైతే దేశం ఎలా ముందుకు వెళ్తుందని కేజ్రివాల్ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు.