ఆమరణ దీక్షకు దిగుతా.. ఢిల్లీలోనూ నాన్ స్టాప్ కామెడీ..
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినలో మౌన దీక్ష చేపట్టారు పాల్.
తెలంగాణలో తనకు 60 శాతం ఓట్లు వస్తాయంటూ ఆ మధ్య హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి కామెడీ చేశారు కేఏపాల్. ఆ తర్వాత వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో 50 శాతం ఓట్లు సాధిస్తామన్నారు. ఇప్పుడు హస్తినకు వెళ్లారు. అక్కడ మౌన దీక్ష చేపట్టిన పాల్ మరింత హంగామా చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తినలో మౌన దీక్ష చేపట్టారు పాల్. అంతే కాదు.. దీక్షకు ముందు ఆయన ప్రెస్ మీట్ లో మరింత హాస్యాన్ని పండించారు.
ఇప్పుడు మౌన దీక్ష.. కుదరకపోతే ఆమరణ దీక్ష..
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలు నెరవేరక ఎనిమిదేళ్లవుతోంది. ఇప్పటి వరకూ అతీగతీ లేదు. ప్రధానమైన ప్రత్యేక హోదానే అటకెక్కించేసింది కేంద్రం. మిగతా హామీలు నెరవేర్చడం కూడా వారికి ఇష్టంలేదు. అందుకే నాన్చుతోంది. ముఖ్యమంత్రులు విన్నవించినా కరగని ప్రధాని మోదీ, పాల్ మౌనదీక్షకు కరుగుతారా..? ఛాన్సే లేదు. అయితే పాల్ కి కావాల్సింది అది కాదు.. ప్రచారం. తెలంగాణలో ఎన్నికల ఏడాది దగ్గరపడిన వేళ పాల్ ప్రచారం కోరుకుంటున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి మరీ దీక్ష చేపట్టారు. అయితే ఆమరణ దీక్ష చేస్తానంటూ ఆయన డెడ్ లైన్ పెట్టడమే కాస్త హాస్యాస్పదంగా ఉంది.
ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్, ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించారు. తాను కూడా అలాంటి సాహసం చేస్తే తనకూ మైలేజ్ వస్తుందనుకున్నారో ఏమో.. పాల్ కూడా ఆమరణ దీక్షకు దిగుతానంటున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో 3 గంటలు మౌన దీక్ష చేసిన ఆయన దేశవ్యాప్తంగా తనతోపాటు 2.1 కోట్ల మంది ప్రజలు ఉపసవాసం ఉన్నారని చెప్పి బాంబు పేల్చారు. మరి వారంతా పాల్ అభిమానులో లేక శనివారం రెగ్యులర్‌గా ఉపవాసం ఉండేవారో తెలియదు. ఇక విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోతే ఆగస్ట్ 15 తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. తెలుగు ప్రజల సత్తా చూపకపోతే విభజన హామీలు అమలు కావంటున్నారు. అందుకే తాను పోరాటానికి దిగుతున్నానని చెప్పారు.