రేపే ఝార్ఖండ్ అసెంబ్లీలో సీఎం సొరేన్ బల పరీక్ష
ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చాలని ఒక వైపు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుండగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసన సభలో రేపు బలపరీక్షకు సిద్దమయ్యారు. బీజేపీ ప్రయత్నాలకు చెక్ పెట్టడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ రేపు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే ఆయన కూడా శాసనసభలో తన బల నిరూపణకు సిద్ధమయ్యారు. తన శాసన సభ్యత్వ అనర్హత సమస్య కారణంగా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు హేమంత్... అసెంబ్లీయే సరైన వేదిక అని భావిస్తున్నారు. పైగా బీజేపీ నేతల ట్వీట్ల వల్ల అయోమయ పరిస్థితి నెలకొందని.. ఈ అనిశ్చితికి స్వస్తి చెప్పి.. ప్రజల్లోని సందేహాలకు చెక్ పెట్టవలసిన అవసరంకూడా ఉందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి అలంగిర్ ఆలమ్ అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తమ సీఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి ఉందని, తమకు అనుకూలంగా ప్రజాతీర్పు ఉన్న నేపథ్యంలో దేనికీ వెనుకాడమని ఆయన చెప్పారు. ఢిల్లీలో బీజేపీ 'ఆపరేషన్ లోటస్' విఫలమైందని నిరూపించడానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రభుత్వ మెజారిటీని అసెంబ్లీలో రుజువు చేసుకున్నారని, అదే పంథాను తాము ఇక్కడ కూడా అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు.
హేమంత్ సొరేన్ అనర్హత విషయంలో గవర్నర్ మౌనంగా ఉన్నారు.. కానీ ఎన్నికల కమిషన్ నుంచి లేఖ అందిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు అని అలంగిర్ ఆలమ్ స్పష్టం చేశారు. తాము గవర్నర్ ని కలిసిన తరువాత ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లారని, దీన్ని బట్టి చూస్తే.. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ సమయం కోరుతున్నట్టు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన మెడికల్ చెకప్ కోసం ఢిల్లీ వెళ్లారని, ఆదివారం తిరిగి వస్తారని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
81 మంది సభ్యులున్న అసెంబ్లీలో సొరేన్ ఆధ్వర్యంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్ఛాకు 30 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది, ఆర్జెడీ, రాష్ట్రీయ జనతాదళ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు ఉండగా.. విపక్ష బీజేపీకి చెందిన 26 మంది సభ్యులు ఉన్నారు. ఈనెల 5 న రాష్ట్ర శానససభను ప్రత్యేకంగా ఒకరోజు సమావేశపరుస్తున్నట్టు స్పీకర్ రవీంద్రనాథ్ మహతో ఇదివరకే ప్రకటించారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు, సభలో తమ వ్యూహ రచనను నిర్ధారించుకునేందుకు బీజేపీ సభ్యులు కూడా ఆదివారం తమ లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. శాసన సభలో తమ ముఖ్యమంత్రి బల నిరూపించుకుని నెగ్గుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.