క్యాన్సర్‌ను జయించిన చంద్రయాన్ హీరో
ఇస్రో తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టిన రోజే తనకు క్యాన్సర్ ఉందని బయటపడిందని సోమనాథ్ చెప్పారు.
చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో మన దేశ కీర్తిపతాక వినువీధిలో ఎగరేయడంలో కీలక పాత్రధారి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన ఆయన ఇప్పుడు మరో విజయం సాధించారు. అది స్పేస్ రీసెర్చ్‌లో కాదు.. మనిషి అంతు చూసే క్యాన్సర్ మీద. ఆ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోమనాథే ప్రకటించారు.
ఆదిత్య ఎల్-1 ప్రారంభం రోజునే బయటపడిన వ్యాధి
ఇస్రో తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టిన రోజే తనకు క్యాన్సర్ ఉందని బయటపడిందని సోమనాథ్ చెప్పారు. ‘చంద్రయాన్-3 ప్రయోగ సమయంలోనే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నిరుడు సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం రోజు కడుపులో సమస్యగా ఉందని వైద్య పరీక్షలు చేయించుకున్నాను. డాక్టర్లు క్యాన్సర్ అన్నారు. కడుపులో క్యాన్సర్ కణితి పెరిగిందని, అది వంశపారం పర్యంగా వచ్చే వ్యాధి అని నిర్ధారణ అయింది.
నాలుగు రోజుల్లో కోలుకున్నా.. 5వ రోజు నుంచి ఆఫీసుకొచ్చా
వైద్యుల సూచన మేరకు ఆ కణితికి శస్త్రచికిత్స చేయించి తొలగించుకున్నాను. కీమోథెరపీ కూడా చేశారు. చికిత్స కోసం నాలుగు రోజులే ఆస్పత్రిలో ఉన్నానని సోమనాథ్ చెప్పారు. ఐదో రోజు నుంచి ఇస్రోలో రోజువారీ విధులు నిర్వర్తించానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నాననంటూ ఇస్రో ఛైర్మన్ గుడ్ న్యూస్ చెప్పారు.