అంతర్జాతీయ క్రికెటర్ ని అంటూ సీఎంకే బురిడీ

వినోద్ కుమార్ అసలు రాష్ట్ర క్రీడాకారుడు కూడా కాదని, ఆయన ఇండియా టీమ్ కి ఎలా ప్రాతినిధ్యం వహించాడని కూపీ లాగారు కొందరు. పాస్ పోర్ట్ కూడా లేని వినోద్ కుమార్ లండన్లో ఎప్పుడు మ్యాచ్ ఆడారని ఆరా తీశారు.

Advertisement
Update:2023-04-27 12:28 IST

అంతర్జాతీయ క్రికెటర్ ని అంటూ సీఎంకే బురిడీ

వికలాంగుల క్రికెట్ లో బ్లైండ్, వీల్ చైర్, డిసేబుల్డ్ అనే మూడు కేటగిరీలుంటాయి. ఇందులో వీల్ చైర్ ఇండియా టీమ్ కి తాను ప్రాతినిధ్యం వహించానని, లండన్లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ లో ఇండియా వీల్ చైర్ టీమ్ తరపున ఆడానని ఓ వికలాంగుడు ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ నే బురిడీ కొట్టించాడు.


కోల్ కతా వెళ్లినప్పుడు ఓ షాపులో కొనుక్కొచ్చిన కప్, షీల్డ్, మెడల్ ని తీసుకుని సీఎం స్టాలిన్ తో కలసి ఫొటో దిగాడు. అంతే కాదు, అతడి మాటలు నమ్మి తమిళనాడులోని కొందరు మంత్రులు ఆర్థిక సాయం కూడా చేశారు. తమ శాఖల తరపున నిధులు విడుదల చేయించి ఇచ్చారు. ఇంతా చేస్తే.. అతడు ఓ మోసగాడు అని తేలింది. ఏకంగా సీఎంనే చీట్ చేయడం, ఆ ఫొటోలు పేపర్లో వేయించుకుని అందరి పరువు తీయడంతో పోలీసులు కేసు పెట్టారు. అరెస్ట్ చేసి జైలులో వేశారు.

అసలేం జరిగిందంటే..?

తమిళనాడులోని రామనాధపురానికి చెందిన వినోద్ కుమార్, అనే వ్యక్తి చాలా పద్ధతిగా ప్రభుత్వాన్ని, సీఎం స్టాలిన్ ని మోసం చేశాడు. వికలాంగుడు కావడంతో వినోద్ కుమార్ వీల్ చైర్ కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. క్రికెట్ అంటే అతడికి ఇష్టం.

ఇటీవల కోల్ కతాలో జరిగిన వికలాంగుల క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్న వినోద్ కుమార్ కి ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఆలోచన వచ్చింది. కోల్ కతా నుంచి వచ్చేటప్పుడు ఓ కప్పు, షీల్డ్, మెడల్ కొనుక్కుని వచ్చాడు. వాటిని తీసుకుని జిల్లా కలెక్టర్ ని కలిశాడు. తాను లండన్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో భారత్ కి ప్రాతినిధ్యం వహించానని చెప్పుకున్నాడు. తనకు ఉద్యోగం కావాలని అభ్యర్థించాడు. ఇలయంగుడి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి అయిన రాజకన్నప్పన్ ని కలిసి ఆర్థిక సాయం కావాలన్నాడు. తన నియోజకవర్గానికి పేరు తెచ్చాడనే అభిమానంతో ఆయన కొంత ఆర్థిక సాయం చేశాడు.

ఇటీవల మంత్రి కన్నప్పన్, సీఎం స్టాలిన్ ని కలిసే సందర్భంలో.. తన నియోజకవర్గ ప్రతిభ చూపించడానికి వినోద్ కుమార్ ని వెంటబెట్టుకుని వెళ్లాడు. అక్కడ స్టాలిన్ తో కూడా లేనిపోని గొప్పలు చెప్పుకున్నాడు వినోద్ కుమార్. తీరా ఆ ఫొటోలు మీడియాలో రాగానే విషయం తెలిసినవారు అవాక్కయ్యారు.

వినోద్ కుమార్ అసలు రాష్ట్ర క్రీడాకారుడు కూడా కాదని, ఆయన ఇండియా టీమ్ కి ఎలా ప్రాతినిధ్యం వహించాడని కూపీ లాగారు కొందరు. పాస్ పోర్ట్ కూడా లేని వినోద్ కుమార్ లండన్లో ఎప్పుడు మ్యాచ్ ఆడారని ఆరా తీశారు. దీంతో ఈ వ్యవహారం అబద్ధమని తేలిపోయింది. వినోద్ కుమార్ టోటల్ గా అందర్నీ బురిడీ కొట్టించేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. పాస్ పోర్టే లేని వినోద్ కుమార్, పాకిస్తాన్ వెళ్లాను, లండన్లో కప్పు గెలుచుకున్నానని చెప్పడం, దాన్ని అధికారులు, మంత్రులు నమ్మడం, ఏకంగా సీఎం దగ్గరకు తీసుకుని ఫొటోలు దిగడం.. తమిళనాట కలకలం రేపింది. 

Tags:    
Advertisement

Similar News