ఏప్రిల్-1నుంచి బంగారం మరింత ప్రియం.. సెల్ ఫోన్లు చౌక
పుత్తడి లేకపోతే ఇత్తడి అంటూ ఇమిటేషన్ ఆభరణాలతో సరిపెట్టుకుందామనుకుంటున్నారా.. ఏప్రిల్-1 నుంచి వాటి రేట్లు కూడా పెరుగుతాయి. ఇమిటేషన్ ఆభరణాలతోపాటు, కిచెన్ లో వాడుకునే చిమ్నీలు, సిగరెట్ల ధరలు కూడా పెరుగుతాయి.
మార్చి 31లోపు పాన్, ఆధార్ లింక్ చేసుకోవాల్సిందే. డీమ్యాట్ అకౌంట్లకు నామినీ వివరాలు ఇవ్వాల్సిందే. ఈసారి వీటికి గడువు పొడిగించేది లేదని అంటున్నారు. అంటే ఏప్రిల్-1 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండవని తేలిపోతోంది. వీటితోపాటు.. కేంద్ర బడ్జెట్ లోని కొత్త పన్ను శ్లాబులు ఏప్రిల్-1నుంచి అమలులోకి వస్తాయి. దీంతో కొన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి, మరికొన్ని తగ్గుతాయి. ఇంతకీ వేటి రేట్లు పెరుగుతాయి, ఏప్రిల్ 1 తర్వాత ఏవి చౌకగా లభిస్తాయి. మీరే చూడండి.
మేకిన్ ఇండియాని ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన సుంకాలు ఏప్రిల్-1నుంచి అమలులోకి వస్తాయి. పన్నుశ్లాబులు కూడా కాస్త మారాయి. దీంతో ఏప్రిల్-1నుంచి కొన్నిరకాల వస్తువుల రేట్లు పెరుగుతాయి. ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్ల రేట్లు పెరుగుతాయని తెలుస్తోంది. అయితే వీటితో సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి వీటి రేట్లు పెరిగినా, తగ్గినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్లాస్టిక్ నివారణ కోసం ప్లాస్టిక్ వస్తువులపై పన్ను పెంచడంతో వాటి రేట్లు కూడా పెరుగుతున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం ఆభరణాల రేట్లు కూడా పెరుగుతాయి. పుత్తడి లేకపోతే ఇత్తడి అంటూ ఇమిటేషన్ ఆభరణాలతో సరిపెట్టుకుందామనుకుంటున్నారా.. ఏప్రిల్-1 నుంచి వాటి రేట్లు కూడా పెరుగుతాయి. ఇమిటేషన్ ఆభరణాలతోపాటు, కిచెన్ లో వాడుకునే చిమ్నీలు, సిగరెట్ల ధరలు కూడా పెరుగుతాయి.
ఇటీవల కాలంలో ప్రతి బడ్జెట్ తర్వాత సెల్ ఫోన్ల రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఈసారి బడ్జెట్ తర్వాత కూడా సెల్ ఫోన్ల రేట్లు తగ్గుతాయి. మొబైల్ ఫోన్లతోపాటు చార్జర్లు, టీవీలు, కెమెరా లెన్స్ లు, లిథియం అయాన్ బ్యాటరీలు మరింత చౌకగా లభిస్తాయి. బంగారం, వెండి, ప్లాటినం ధరలు పెరుగుతాయి కానీ వజ్రాలు, రంగురాళ్ల ధరలు మాత్రం ఏప్రిల్-1నుంచి తగ్గుతాయి. బొమ్మలు, సైకిళ్ల రేట్లు కూడా తగ్గుతాయి. ఇక విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేలా భారత్ లో తయారైన ఎలక్ట్రిక్ వాహనాల రేట్లు తగ్గేలా కేంద్రం చర్యలు తీసుకుంది.
ఏప్రిల్-1నుంచి అధికారికంగా ఆయా వస్తువుల రేట్లు పెరుగుతాయని చెబుతున్నా.. ఇప్పటికే వ్యాపారస్తులు కొత్త రేట్లను అమలులోకి తెచ్చారు. అయితే రేట్లు తగ్గే వస్తువుల విషయంలో మాత్రం ఏప్రిల్-1 తర్వాతే తగ్గిన ధరలు అందుబాటులోకి వస్తాయంటున్నారు.