అల్యూమినియంతో వందే భారత్ రైళ్లు.. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం

అల్యూమినియంతో తేలికగా ఉండే రైల్వే కోచ్ ల తయారీలో ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ అందెవేసిన చేయి. అందుకే 100 రైళ్లను తయారు చేసేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.

Advertisement
Update:2023-06-02 08:00 IST

వందే భారత్ రైళ్ల వేగం పెంచేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆల్ స్టోమ్ 100 వందే భారత్ రైళ్లను అందిస్తుంది. ఒక్కో దాని ఖరీదు 150.9 కోట్ల రూపాయలుగా నిర్థారించారు. ఆల్ స్టోమ్ తయారు చేసిన రైళ్లు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవని తెలుస్తోంది. ప్రస్తుతం గంటకు 110 నుంచి 160కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి.

ఇప్పటి వరకు మన రైల్వే కోచ్ లు, ఇంజిన్ల తయారీలో ఉక్కు, ఇనుము వాడకం ఎక్కువగా ఉంది. వందే భారత్ తయారీలో స్టీల్ బాడీలను వాడారు. దీని ద్వారా రైలు బరువు తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది. అయితే ఇది కూడా వేగానికి కాస్త ప్రతిబంధకంగానే కనిపిస్తోంది. ఇప్పుడు పూర్తిగా అల్యూమినియం బాడీతో రైళ్లను తయారు చేయడానికి సిద్ధమయ్యారు. అల్యూమినియంతో తేలికగా ఉండే రైల్వే కోచ్ ల తయారీలో ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ అందెవేసిన చేయి. అందుకే 100 రైళ్లను తయారు చేసేందుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.

భారీ ఆర్డర్లు..

భారత్ లో వందే భారత్ రైళ్లను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అడిగినా, అడక్కపోయినా.. రాష్ట్రాలకు ఉదారంగా వందే భారత్ రైళ్లను ఇస్తోంది. భారత్ కంపెనీ RVNL, రష్యా కంపెనీ TMH సంయుక్త భాగస్వామ్యంలో ఉన్న కంపెనీకి 120 రైళ్ల తయారీ ఆర్డర్ ఇచ్చారు. BHEL, టిటాగర్ వేగన్ తయారీ సంస్థ సంయుక్తంగా మరో 80 రైళ్లను తయారు చేస్తున్నాయి. వీటికి అదనంగా ఇప్పుడు 100 వందే భారత్ రైళ్లను ఫ్రెంచ్ కంపెనీ ఆల్ స్టోమ్ నుంచి తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది.

Tags:    
Advertisement

Similar News