ఖాళీ టైంలో వేరే జాబ్ చేసుకోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫుడ్ డెలివరీ కంపెనీ

ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త పాలసీ తీసుకొని వచ్చింది. 'మూన్‌లైట్ పాలసీ' పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ఆ సంస్థలో పని చేస్తున్న చాలా మందికి అదనంగా మరో చోట పని చేసుకునే వెసులుబాటు లభించింది.

Advertisement
Update:2022-08-03 21:39 IST

కరోనా మ‌హమ్మారి కార‌ణంగా చాలా మంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు. అంతే కాకుండా ఉద్యోగం ఉన్నా.. స‌మ‌యానికి జీతాలు రాకుండా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారికి ఫుడ్ డెలివరీ, ఈ-కామర్స్ సంస్థలే ఎక్కువగా అండగా నిలిచాయి. కనీసం ఇంటి రెంట్లు, నెలసరి ఖర్చులకు ఇలాంటి ఉద్యోగాలే చాలా మందికి ఆసరాగా ఉన్నాయి. కరోనా భయం చాలా వరకు తగ్గిపోవడంతో మళ్లీ అన్ని సంస్థలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. అయితే అప్పట్లో ఉద్యోగాలు వదిలి డెలివరీ సంస్థల్లో చేరిన వాళ్లు.. ఇప్పుడు కొత్త జాబ్‌లో జాయిన్ అవడం కష్టంగా మారింది. కంపెనీలు తమ కార్యకాలపాలు మొదలు పెట్టినా.. అప్పట్లో ఇచ్చినట్లు భారీ జీతాలు ఇవ్వడం లేదు. దీంతో ఇటు డెలివరీ పార్ట్‌నర్స్‌గా చేయలేక.. అటు కొత్త ఉద్యోగాల్లో భారీ జీతాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటి వారి కోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త పాలసీ తీసుకొని వచ్చింది. 'మూన్‌లైట్ పాలసీ' పేరుతో తీసుకొచ్చిన ఈ విధానం వల్ల ఆ సంస్థలో పని చేస్తున్న చాలా మందికి అదనంగా మరో చోట పని చేసుకునే వెసులుబాటు లభించింది. స్విగ్గీలో పని చేస్తూనే అదనంగా మరో చోట పని చేసుకొని.. మరింత వేతనం పొందే అవకాశాన్ని ఇచ్చింది. సిబ్బందికి అదనపు డబ్బు అవసరం అనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంటుంది. అయితే ఇందుకు కొన్ని నిబంధలను పాటించాల్సి ఉంది.

ఎవరైనా స్విగ్గీ ఎంప్లాయ్ వేరే కంపెనీలో పార్ట్‌టైం జాబ్‌ చేయాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలాగే రెండో ఉద్యోగం కారణంగా స్విగ్గీ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. అంతే కాకుండా అది స్విగ్గీపై ప్రభావం చూపని పని వేళలై ఉండాలి. స్విగ్గీలో పని ముగించుకున్న తర్వాత.. లేదా వీకాఫ్ డేస్‌లో ఎక్స్‌ట్రా మనీ కోసం పని చేసుకోవచ్చని తెలిపింది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా తమ ఉద్యోగులు ఖాళీగా ఉండకుండా వేరే ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చినట్లు కంపెనీ గుర్తు చేస్తోంది. ఇలాంటి పనులు వ్యక్తిగతంగా డబ్బు తీసుకొని రావడమే కాకుండా.. ప్రొఫెషనల్‌గా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతాయని చెప్పింది. మరోవైపు.. తమ కంపెనీ ఆఫీసు ఉద్యోగులు ఇకపై ఎక్కడి నుంచి అయినా పని చేసుకునే వెసులుబాటు కూడా స్విగ్గీ కల్పించింది.

Tags:    
Advertisement

Similar News