టమాటా తోటకు సీసీ కెమెరాలతో నిఘా
తాజాగా కర్నాటకకు చెందిన రైతు సోదరులు తమ టమాటా తోటకు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి కదలికలను గమనిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
గత కొన్ని రోజులుగా కొండెక్కిన టమాటాల ధరలు సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. మార్కెట్లో సాధారణంగా తక్కువ ధరకే అందుబాటులో ఉండే టమాటాలు ఇప్పుడు అందనంత ఎత్తులో ఉన్నాయి. కిలో టమాటా ధర పలుచోట్ల ఏకంగా రూ.250 కూడా పలుకుతుండటం గమనార్హం. ధరలు పెరగడంతో కొత్తగా టమాటాల దొంగలు పుట్టుకొస్తున్నారు. పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల టమాటాలతో ఉన్న వ్యాన్‌నే ఎత్తుకుపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
టమాటాల దొంగలు పెచ్చుమీరుతున్న నేపథ్యంలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో వాటిని కాపాడుకోవడం కోసం పలువురు రైతులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అవి అందరినీ విస్తుపోయేలా చేస్తుండటం విశేషం. యూపీలోని ఓ వ్యాపారి అయితే ఇటీవల తన టమాటాలకు ఏకంగా బాడీగార్డులను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసింది.
తాజాగా కర్నాటకకు చెందిన రైతు సోదరులు తమ టమాటా తోటకు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి కదలికలను గమనిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. హూసూర్ మండలంలోని కుప్పే గ్రామంలో నగేష్, కృష్ణ అనే సోదరులకు 10 ఎకరాల పొలం ఉంది. అందులో మూడున్నర ఎకరాల్లో వారు టమాటాలు సాగు చేస్తున్నారు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో వారి పొలంలో ఇటీవల దొంగలు పంట దోచుకెళ్లారు. దీంతో రైతులు ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండటం కోసం పొలం వద్ద రెండు సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వాటిని తమ మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేయించుకున్నారు. ఇప్పుడు వారు పొలం దగ్గర కాపలా కాయాల్సిన అవసరం లేకుండా అక్కడి కదలికలను ఫోన్‌లోనే చూసి తెలుసుకోగలుతుండటం విశేషం. వీరి ఐడియా అదిరింది కదూ!