ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ హఠాన్మరణం
దెబ్రాయ్ మృతి పట్ల ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి
ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ మృతి చెందారు. ప్రధాని ఆర్థిక సలహామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్ శుక్రవారం హఠాత్తుగా మరణించారు. దెబ్రాయ్ మృతి పట్ల ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
'డాక్టర్ దెబ్రాయ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఇలా ఎన్నో విభిన్న రంగాల్లో ఆయకు ఎంతో ప్రావీణ్యం ఉన్నది. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి అతీతం. ప్రాచీన గ్రంథాలపై పనిచేయడమంటే ఆయనకు ఎంతో ఇష్టం. యువత కోసం వాటిని అందుబాటులోకి తెచ్చారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని ప్రధాని పేర్కొన్నారు.
దెబ్రాయ్ గతంలో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పూణెలోని గోఖలే ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్‌లో ఛాన్స్‌లర్‌గా, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌లో విధులు నిర్వహించారు. ఆ తర్వాత పలు ఇన్‌స్టిట్యూట్‌లలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019 వరకు దెబ్రాయ్ నీతి ఆయోగ్ సభ్యుడిగా ఉన్నారు. పలు పుస్తకాలు, కథనాలు రచించడంతో పాటు పలు వార్తా సంస్థలకు సంపాదకులుగా వ్యవహరించారు. ఆర్థికశాస్త్రంలో దెబ్రాయ్ చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.