టిఎన్ శేషన్ వంటి ఎన్నికల అధికారి అవసరం... సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుత పరిస్థితుల్లో టీ ఎన్ శేషన్ వంటి ఎన్నికల అధికారి దేశానికి అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సంస్కరణలు తేవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేష్ రాయ్ , సి టి రవికుమార్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది.
ప్రధాన ఎన్నికల సంఘం భుజస్కందాలపై భారత రాజ్యాంగం విస్తృత అధికారాలు ఉంచిందని సుప్రీంకోర్టు పేర్కొంది. టి.ఎన్ శేషన్ వంటి బలమైన ఎన్నికల అధికారి సీఈసీ గా ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొంది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లతో పాటు ప్రధాన ఎన్నికల అధికారితో కూడిన ఎన్నికల సంఘం బలంగా విశ్వసనీయతతో పనిచేయాల్సి ఉంటుందని, ఇందుకు రాజ్యాంగం వారికి ఆ అధికారాలు కల్పించిందని తెలిపింది.
"క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. 1990- 1996 మధ్యలో పోల్ ప్యానెల్ చీఫ్‌గా కీలక ఎన్నికల సంస్కరణలను తీసుకొచ్చిన టిఎన్ శేషన్ వంటి సిఇసి ఇప్పుడు కావాలి " అని కోర్టు మంగళవారంనాడు వ్యాఖ్యానించింది.
ఎన్నికల కమిషనర్ల నియామక వ్యవస్థలో సంస్కరణలు తేవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో న్యాయమూర్తులు అజయ్ రస్తోగి, అనిరుద్ధ బోస్, హృషికేష్ రాయ్ , సి టి రవికుమార్‌లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. "ఉత్తమ వ్యక్తి" సిఇసిగా ఎంపికయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేయడమే తమ ప్రయత్నం అని పేర్కొంది.. ఎన్నికల కమిషనర్ల స్వతంత్రతపై ప్రభుత్వం మాటలు మాత్రమే చెబుతోందని పేర్కొంది.
"అనేక మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు(సిఈసీ) వచ్చినప్పటికీ శేషన్ లాంటి వ్యక్తులు రావడం ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతుంది. వారిని ఎవరూ బుల్డోజ్ చేయకూడదని మేము కోరుకుంటున్నాము. అపారమైన అధికారం ముగ్గురు వ్యక్తుల (సీఈసీ, మరో ఇద్దరు ఎన్నికల కమీషనర్లు) భుజస్కందాలపై ఉంది. అందువల్ల సిఈసీ పదవికి ఉత్తమమైన వ్యక్తి ని మేము చూడాల్సి ఉంది '' అని కోర్టు పేర్కొంది.
"ముఖ్య విషయం ఏమిటంటే, మేము చాలా మంచి విధానాన్ని రూపొందించాము, తద్వారా సమర్థతతో పాటు, ఉత్తమమైన వ్యక్తిత్వం గల బలమైన వ్యక్తి సీఈసీ గా నియమితులు కావాలి " అని కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణికి కోర్టు తెలిపింది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ఉత్తమమైన వ్యక్తులను నియమించాలన్న అభిప్రాయాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే అటువంటి వారిని ఎలా పట్టుకోవాలనేదే ప్రశ్న అని అన్నారు. రాజ్యాంగం ప్రకారమే కేబినెట్ మంత్రుల సహాయ, సలహాలతోనే సీఈసిని రాష్ట్రపతి నియమిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
ఎన్నికల కమిషన్‌తో సహా రాజ్యాంగ సంస్థల నియామకాలకు కొలీజియం లాంటి వ్యవస్థ ఉండాలని 1990 నుండి బిజెపి కురువృద్ధుడు ఎల్‌కె అద్వానీతో సహా అనేక మంది కోరుతున్నారని ధర్మాసనం పేర్కొంది.
"ప్రజాస్వామ్యం అనేది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం. దానిపై చర్చ లేదు. మేము కూడా పార్లమెంటుకు ఏదో ఒకటి చేయమని చెప్పలేము . మేము అలా చేయం కూడా . 1990 నుండి తీవ్రమైన ఈ సమస్యకు మేము ఏదైనా చేయాలనుకుంటున్నాము"అని కోర్టు పేర్కొంది.
2004 నుంచి ఏ సీఈసీ కూడా ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదని కోర్టు ప్రస్తావించింది. పదేళ్ల యూపీఏ హయాంలో ఆరుగురు సీఈసీలు పనిచేయగా, ఎన్డీయే హయాంలో ఎనిమిది మంది పనిచేశారని గుర్తు చేసింది. "ప్రభుత్వం ఈసీలు, సీఈసీలకు అతి తక్కువ కాలపరిమితి ఉండేలా చేస్తోందని " అని కోర్టు పేర్కొంది. ఎన్నికల అధికారులు, ప్రదాన ఎన్నికల కమిషనర్ నియామకాల విషయంలో కొలిజియం తరహా వ్యవస్థ ఉండాలన్న వాదనల నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ అలాంటి ప్రయత్నమేదైనా జరిగితే అది రాజ్యాంగాన్ని సవరించడమేనని ప్రభుత్వం వాదిస్తోంది.