రీల్స్ పేరిట ఆకతాయిల వేధింపులు.. చెత్త ఏరుకునే వృద్ధుడి ఆత్మహత్య
ఆ వృద్ధుడు చెత్త అమ్ముతుండగా వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో గ్రామంలో అతడిని అందరూ హేళన చేయడం మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ చేయడం కోసం ఆకతాయిలు ఎంతకైనా తెగిస్తున్నారు. వైరల్ వీడియోల కోసం వారు చేస్తున్న చేష్టలు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇలా రీల్స్ పేరిట చెత్త ఏరుకునే వృద్ధుడిని ఆకతాయిలు వేధించగా.. మనస్తాపం చెందిన అతడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని లోహావత్‌లో జరిగింది.
బర్మేర్ జిల్లా చోహ్ టాన్ గ్రామానికి చెందిన ప్రతాప్ రామ్ సింగ్ అనే వృద్ధుడు వీధుల్లో పడేసిన చెత్త, ప్లాస్టిక్ బాటిళ్లు సేకరిస్తూ గ్రామంలో వాటిని విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవనం సాగిస్తుంటాడు. ప్రతాప్ రామ్ సింగ్ చెత్త బండితో వీధుల గుండా తిరుగుతూ అవసరమైన వారికి చెత్త విక్రయిస్తుంటాడు.
అలా అతడు కొందరు యువకులను కూడా చెత్త కొనుగోలు చేస్తారా? అని అడిగాడు. సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఆ యువకులు ఆ వృద్ధుడు చెత్త అమ్ముతుండగా వీడియోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో గ్రామంలో అతడిని అందరూ హేళన చేయడం మొదలుపెట్టారు. దీంతో కొద్ది రోజులుగా ప్రతాప్ రామ్ సింగ్ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడు.
ఆదివారం కూడా ఆ వృద్ధుడు చెత్త బండితో ప్రహ్లోదీ స్టేట్ హైవే గుండా వెళ్తుండగా కొందరు ప్రతాప్ రామ్ సింగ్ ను హేళన చేశారు. దీంతో వారు చూస్తుండగానే ఆ వృద్ధుడు పక్కనే ఉన్న చెట్టెక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కిందకుదింపి పోస్టుమార్టానికి తరలించారు. రీల్స్ పేరిట ఆకతాయిలు చేస్తున్న వేధింపుల కారణంగా వృద్ధుడు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.