హర్యానా కాంగ్రెస్‌ లో సెల్జా ప్రకంపనలు

ఎన్నికల వేళ హస్తం పార్టీకి సంకటంగా సీనియర్‌ నేత మౌనం

Advertisement
Update:2024-09-25 13:51 IST

అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానా కాంగ్రెస్‌ లో కుమారి సెల్జా మౌనం ప్రకంపనలు సృష్టిస్తోంది. సీనియర్‌ దళిత నేత సెల్జా అసెంబ్లీ ఎన్నికల ముంగిట మౌనం వహించడంతో ప్రత్యర్థి పార్టీలు దానిని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్నాయి. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నానని సెల్జా చెప్తోన్నా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. సొంత రాష్ట్రంలో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన సమయంలో సైలెంట్‌ గా ఉంటున్నారు. హర్యానాలోని సిర్సా నుంచి ఎంపీగా ఉన్న ఆమె కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఒకరు. మాజీ సీఎం భూపేందర్‌ సింగ్‌ హుడాతో నెలకొన్న విభేదాలో, ఇంకా వేరే కారణాలేమైనా ఉన్నయేమోకాని ఆమె ఎన్నికల ప్రచారానికి ఆమె దూరమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైన ఈనెల 12వ తేదీ నుంచి ఆమె ఎక్కడా నోరు విప్పలేదు. అక్టోబర్‌ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల ప్రచారం ముగియడానికి ఇంకో వారం రోజులు మాత్రమే గడువుంది. మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌ లో కేంద్ర మంత్రిగా పని చేసిన సీనియర్‌ దళిత నేత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా, ఆమెను బుజ్జగించి కార్యక్షేత్రంలో తీసుకువచ్చే ప్రయత్నాలేవి కాంగ్రెస్‌ హైకమాండ్‌ చేయడం లేదు. భూపేందర్‌ సింగ్‌ హుడా అయితే ఆమెను లైట్‌ తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సెల్జాను అవమానిస్తోందని.. గౌరవం లేని చోట ఆమె ఉండాల్సిన పని లేదని.. తమ పార్టీలో చేరాలని బీజేపీ, బీఎస్పీ ఆఫర్‌ చేస్తున్నాయి.

కాంగ్రెస్‌ కు దళిత ఓట్లు దూరమవుతాయా?

కాంగ్రెస్‌ పార్టీకి సెల్జా దూరంగా ఉండటంతో దళితుల ఓట్లు హస్తం పార్టీకి దూరమవుతాయా అనే చర్చ జరుగుతోంది. సెల్జా మౌనంతో బీఎస్పీ అధినేత మాయావతి దళిత ఓట్లపై ఫోకస్‌ చేశారు. బీజేపీ సైతం సెల్జాను కాంగ్రెస్‌ అవమానించిందని చెప్తూ దళిత ఓట్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. హర్యానా జనాభాలో ఎస్సీలు 20 శాతం ఉంటారు. ఎస్సీలు ఎటువైపు మొగ్గితే విజయం అటువైపే ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందు దళిత ఓట్లపై ఫోకస్‌ పెట్టిన కుమారి సెల్జా హర్యానాలో పెద్ద ఎత్తున పర్యటించారు. తీరా ఎన్నికల ముంగిట సైలెంట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో దళితుల ఓట్ల మధ్య చీలిక తెస్తే మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవచ్చనే ఆలోచనల్లో బీజేపీ ఉంది. రాహుల్‌ గాంధీ నాయకత్వం పట్ల ఉన్న పాజిటివ్‌ వాతావరణంతో పాటు రైతు సమస్యలు, అగ్నివీర్‌, రెజర్ల సమస్యలు కాంగ్రెస్‌ కు సానుకూల వాతావరణం క్రియేట్‌ చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెల్జా మౌనంగా ఉండటం కాంగ్రెస్‌ పార్టీకి దళిత ఓట్లను దూరం చేయవచ్చేమో అనే సందేహాలకు తావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News