యువతిని కారుతో ఢీకొట్టి, 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి..
శనివారం ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరిన అంజలి, రాత్రి 10గంటలకు ఇంటికొస్తానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆదివారం ఉదయం రోడ్డుపై శవమై కనిపించింది. ఆమెను కారుతో ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నూతన సంవత్సరం తొలిరోజున ఢిల్లీలో దారుణం జరిగింది. జనవరి 1 తెల్లవారు ఝామున ఢిల్లీలో నగ్నంగా ఉన్న 20 ఏళ్ల ఓ యువతి మృతదేహం రోడ్డుపై పడి ఉంది. స్కూటీపై వెళ్తున్న ఆ యువతిని కారుతో ఢీకొట్టి, నాలుగు కిలోమీటర్ల మేర మృతదేహాన్ని ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది. కారులో ఉన్నవారంతా అప్పటికే ఫుల్లుగా తాగేసి ఉన్నారు. ఇది ప్రమాదమా, లేక హత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
ఛిద్రమైన శరీరం..
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల అంజలి.. వివాహాలు, ఇతర ఫంక్షన్లలో పనిచేస్తుండేది. ఆమె రోజూ ఇంటినుంచి స్కూటీపై బయటకు వెళ్లొస్తుండేది. ఆకుటుంబానికి ఆమే ఆధారం. తండ్రిలేడు, తల్లితోపాటు ఇద్దరు తమ్ముళ్లు, నలుగురు చెల్లెళ్లను ఆమె పోషిస్తుండేది. శనివారం ఉదయాన్నే ఇంటినుంచి బయలుదేరిన అంజలి, రాత్రి 10గంటలకు ఇంటికొస్తానని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. ఆదివారం ఉదయం రోడ్డుపై శవమై కనిపించింది. ఆమెను కారుతో ఢీకొట్టి, ఈడ్చుకెళ్లిన ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహం పూర్తిగా ఛిద్రమైన స్థితిలో దుస్తులు లేకుండా రోడ్డుపై పడిఉంది. ఈ ఘోరం చూసి స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు. కారులో తాగిన మైకంలో ఉన్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అత్యాచారం..?
అంజలిపై అత్యాచారం జరిగిందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. తన కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని తల్లి ఆరోపిస్తోంది. ప్రాథమికంగా ప్రమాదంగా కేసు నమోదు చేసినా, దీని వెనక వాస్తవాలను వెలికి తీస్తామంటున్నారు పోలీసులు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్న రోజున.. ఉపాధికోసం బయటకొచ్చిన ఓ యువతి ఇలా శవమై తేలడం ఢిల్లీలో సంచలనంగా మారింది.