ఆవు పేడ కొంటాం.. కాంగ్రెస్ హామీ.!

అధికారంలోకి వస్తే గో ధన్‌ స్కీం కింద కిలోకు రూ.2 చొప్పున ఆవు పేడ కొంటామని హామీ ఇచ్చారు. బయోగ్యాస్ ఉత్పత్తి చేసి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.

Advertisement
Update:2023-10-28 10:27 IST

రాజస్థాన్‌లో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం రెండు భారీ హామీలు ప్రకటించిన రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌.. శుక్రవారం మరిన్ని హామీలను ఓటర్ల ముందుంచారు. అధికారంలోకి వస్తే గో ధన్‌ స్కీం కింద కిలోకు రూ.2 చొప్పున ఆవు పేడ కొంటామని హామీ ఇచ్చారు. బయోగ్యాస్ ఉత్పత్తి చేసి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో మూడేళ్లుగా అమలవుతోంది.

ఇక వీటితో పాటు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం మార్చలేని విధంగా పాత పెన్షన్‌ స్కీంను తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు గెహ్లాట్. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరిట ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని, ప్రకృతి విపత్తుల్లో నష్టపోయిన వారికి రూ.15 లక్షలు అందే విధంగా బీమా చేయిస్తామన్నారు.

ప్రతి కుటుంబంలోని మహిళకు ఏడాదికి రూ.10 వేలు అందిస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది కాంగ్రెస్‌. దాంతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ను రూ. 500కే అందిస్తామని ప్రకటించింది. కాలేజీల్లోనూ ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడతామని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News