మోసం గురూ..! రెండోసారి గూగుల్ కి భారీ జరిమానా..

గూగుల్ సంస్థ ప్లేస్టోర్ విషయంలో చేసిన అవకతవకలకు సీసీఐ భారీ జరిమానా విధించింది. యాప్ ల విషయంలో మార్కెట్ పై గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపించింది. గూగుల్ కి రూ.936.44 కోట్ల జరిమానా వేసింది. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది.

Advertisement
Update:2022-10-26 09:30 IST

టెక్నాలజీ వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగం అని మనం అనుకుంటాం, అన్ని పనులూ సులభం అయ్యాయని ఆనందపడతాం. కానీ ఇదంతా కార్పొరేట్ కంపెనీల ఆదాయ మార్గంలో భాగమేననే అసలు వాస్తవం మాత్రం ఆలస్యంగా బయటపడుతోంది. తాజాగా గూగుల్ సంస్థ ప్లేస్టోర్ విషయంలో చేసిన అవకతవకలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. యాప్ ల విషయంలో మార్కెట్ పై గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపించిన సీసీఐ గూగుల్ కి రూ.936.44 కోట్ల జరిమానా వేసింది. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది.

ఎందుకీ జరిమానా.. ?

యాప్ లను అభివృద్దిపరచినవారు వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలంటే యాప్ స్టోర్ అవసరం. సరిగ్గా ఇక్కడే గూగుల్ తన ఆధిపత్యాన్ని చూపించాలనుకుంది. ప్రస్తుతం మనం వాడే స్మార్ట్ ఫోన్లు చాలా వరకు ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ పై ఆధారపడినవే. వీటిలో యాప్ లు ఇన్ స్టాల్ చేసుకోవాలంటే, గూగుల్ ప్లే స్టోర్ లో ముందుగా ఆ యాప్ లు లిస్ట్ కావాలి. అంటే యాప్ డెవలపర్లకు గూగుల్ ప్లేస్టోర్ ఒక్కటే ప్రస్తుతానికి ఆధారం. దీంతో యాప్ డెవలపర్లకు నిబంధనల పేరుతో గూగుల్ చుక్కలు చూపెడుతోంది. ప్లేస్టోర్‌ లో తమ యాప్‌ లిస్ట్ చేయాలంటే గూగుల్‌ నియమాలను పాటించడంతో పాటు, గూగుల్ ప్లే బిల్లింగ్‌ సిస్టమ్‌ ను కూడా వారు అనుసరించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ గూగుల్‌ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్నమాట. దీన్ని గమనించిన సీసీఐ గూగుల్‌ కు రూ.936.44 కోట్ల పెనాల్టీ విధించింది.

గతవారం భారీ జరిమానా..

ఆండ్రాయిడ్‌ మొబైల్‌ డివైజ్‌ ఎకో సిస్టమ్‌ లో ఆధిపత్య స్థానాన్ని గూగుల్‌ దుర్వినియోగం చేస్తోందంటూ ఇటీవలే రూ.1337.76 కోట్లు జరిమానా చెల్లించాలని సీసీఐ ఆదేశించింది. అనైతిక వ్యాపార పద్దతులను మానుకోవాలని హితవు పలికింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ని 2005లో కొనుగోలు చేసిన గూగుల్ దాని ద్వారా తన ఫ్రీ యాప్స్ ని వినియోగదారులపై రుద్దుతోంది. ఈ యాప్స్ విషయంలో పోటీ ఉన్నా కూడా గూగుల్ యాప్స్ కచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఉండాల్సిందే. వాటిని డిలీట్ చేయడం కుదరదు. అంటే ఇది గూగుల్ గుత్తాధిపత్యమేనని చెప్పాలి. దీనిపై కూడా సీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.1337.76 కోట్లు జరిమానా విధించింది. వారం వ్యవధిలో యాప్ స్టోర్ విషయంలో ఇప్పుడు మరో 936.44 కోట్ల రూపాయల అదనపు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News