టోల్ గేట్ తీయడంలో ఆలస్యం.. సిబ్బందిని కొట్టి చంపేశారు..!

టోల్ గేట్ సిబ్బందిని చూసిన కారులోని వ్యక్తులు వారిని అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్ తీసుకొని కొట్టడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజునాథ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Advertisement
Update:2023-06-06 11:59 IST

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. టోల్ గేట్ ఆలస్యంగా తెరిచారన్న కారణంతో అక్కడి సిబ్బందిపై కారులో వచ్చిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో టోల్ గేట్ సిబ్బంది ఒకరు చనిపోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి నలుగురు వ్యక్తులు కారులో మైసూర్‌కు వెళ్తూ బెంగళూరు నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రామనగర్ జిల్లాలోని బీదడి టోల్ గేట్ వద్ద ఆగారు. అయితే గేట్ తెరవడంలో ఆలస్యం జరగడంతో కారులో వచ్చిన వ్యక్తులు టోల్ గేట్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. గేటు తీయడానికి ఇంత సమయం తీసుకోవాలా? అని వారిపై మండిపడ్డారు.

ఈ విషయమై కారులోని వ్యక్తులకు, టోల్ గేట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ ముదురుతుండటంతో స్థానికులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కారులోని వ్యక్తులు టోల్ గేట్ వద్ద నుంచి బయలుదేరి అక్కడికి సమీపంలోని రోడ్డుపైనే ఆగారు. కొంతసేపటి తర్వాత టోల్ గేట్ సిబ్బంది అయిన పవన్(26), మంజునాథ్ భోజనం చేసేందుకు అదే రోడ్డు మీదుగా వెళ్లారు.

టోల్ గేట్ సిబ్బందిని చూసిన కారులోని వ్యక్తులు వారిని అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్ తీసుకొని కొట్టడంతో పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మంజునాథ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడ్డ అనంతరం కారులో వచ్చిన వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. స్థానికులు మంజునాథ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. టోల్ గేట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News