విదేశాల్లో చీటింగ్ ఉద్యోగాలు.. బుక్కైపోతారు జాగ్రత్త

నిరుద్యోగ యువతకు ఎరవేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం అంటూ అక్కడికి తీసుకెళ్తారు. తీరా అక్కడికెళ్లాక ఇక్కడి భారతీయులను ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేయాలని ఆదేశిస్తారు.

Advertisement
Update:2022-09-25 12:32 IST

ల్యాప్ టాప్ ముందు వేసుకుని కూర్చున్నవాళ్లంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అయిపోరు. ఆ మాటకొస్తే బీటెక్ చేసి కాల్ సెంటర్లలో పనిచేస్తూ చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగమంటూ చెప్పుకుంటారు. విదేశాల్లో ఎలాంటి అవకాశం వచ్చినా ఇక్కడ చెప్పుకునేది మాత్రం సాఫ్ట్ వేర్ ఉద్యోగమనే. విదేశీ ఉద్యోగం అంటే భారత యువతలో ఉన్న క్రేజే వేరు. ఆ బలహీనతను దృష్టిలో ఉంచుకుని యువతకు విదేశీ కంపెనీలు ఎరవేస్తున్నాయి. డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో బ్యాంకాక్, మయన్మార్, కాంబోడియాకు వెళ్తున్న యువకులకు అక్కడ నరకం చూపిస్తున్నాయి కంపెనీలు.

మన వేలితో మన కళ్లే పొడిచేలా..

ఇక్కడి నిరుద్యోగ యువతకు ఎరవేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఉద్యోగాలు, ఆకర్షణీయమైన జీతం అంటూ అక్కడికి తీసుకెళ్తారు. తీరా అక్కడికెళ్లాక ఇక్కడి భారతీయులను ఫోన్ కాల్స్ ద్వారా మోసం చేయాలని ఆదేశిస్తారు. అమ్మాయిలలాగా చాటింగ్ చేసి అబ్బాయిలకు ఎరవేయడం, ఆన్ లైన్ లోన్ యాప్ ల పేరుతో మోసం చేయడం, లోన్ తీసుకున్నవారిని బెదిరించడం, వారి న్యూడ్ ఫొటోలు తయారు చేయడం.. ఇదీ అక్కడ వారి పని. ఈ పని ఇష్టంలేదని ఎదురు తిరిగితే షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి సైతం వెనకాడరు. తాజాగా తిరుపతికి చెందిన ఓ కుర్రాడికి కాంబోడియాలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది ఇలా విదేశాలకు వెళ్లి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోకూడా బాధితులు చాలామందే ఉన్నా.. ఇప్పుడిప్పుడే కొందరు వెలుగులోకి వస్తున్నారు.

ఆ దేశాలకు వెళ్లొద్దు..

విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆఫర్ ఇచ్చే వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ యువతకు సూచించింది. ఆయా దేశాలకు చెందిన నియామక సంస్థలు, వ్యక్తుల వివరాలను పరిశీలించి నిర్థారించుకున్న తర్వాతే అక్కడకు వెళ్లాలని స్పష్టం చేసింది. ఉద్యోగాలపై ఆశతో కొందరు భారతీయులు మయన్మార్‌ వెళ్లి అక్కడ మోసపోయిన నేపథ్యంలో నకిలీ జాబ్‌ రాకెట్‌ వలలో చిక్కుకోవద్దని హెచ్చరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. థాయిలాండ్, మయన్మార్, బ్యాంకాక్, కాంబోడియా వంటి దేశాలకు ఉద్యోగాలకోసం వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సంస్థల గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేశాకే వెళ్లాలని, అనుమానం ఉంటే వెళ్లకుండా ఉండటమే మంచిదని చెబుతున్నారు అధికారులు.

Tags:    
Advertisement

Similar News