ఆక్సిజన్ పై కేంద్రం అతిపెద్ద అబద్ధం..
కొవిడ్ ఉధృతి వేళ ఆక్సిజన్ లభించక చాలామంది రోగులు చనిపోయినా, ఆ వాస్తవాల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్థాయీ సంఘం పేర్కొంది. ప్రభుత్వానికి అసలు సానుభూతే లేదని అర్థమైందని చెప్పింది.
కరోనా కాలంలో ఆక్సిజన్ కొరతతో ఎంతమంది రోగులు అల్లాడిపోయారో అందరికీ తెలిసిందే. ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో పదిరెట్లు ఎక్కువ ధరకు అమ్ముడయ్యాయి. ఒక్క దశలో అసలు ఆక్సిజన్ దొరకని పరిస్థితి. కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్రాలే నేరుగా విదేశాలనుంచి ఆక్సిజన్ తెప్పించుకున్నాయి. ఎక్కడికక్కడ కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఇంత జరిగితే ఇప్పుడు అసలు ఆక్సిజన్ కొరత కారణంగా భారత్ లో ఒక్క కొవిడ్ మరణం కూడా సంభవించలేదని కేంద్రం చెప్పడం దారుణం. 'వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీ, కొవిడ్ మహమ్మారి నిర్వహణ' పేరుతో పార్లమెంటరీ స్థాయీ సంఘం రాజ్యసభకు ఓ నివేదిక సమర్పించింది. దీనికోసం కేంద్రాన్ని సమాచారం కోరింది. ఈ క్రమంలోనే దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ మరణాలు సంభవించలేదని కేంద్రం స్థాయీ సంఘానికి నివేదించింది. నివేదిక సమర్పించే సమయంలో ఈ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
దేశంలో ప్రాణ వాయువుకు, ఆక్సిజన్ సిలిండర్లకు కొరత లేదన్న ప్రభుత్వ వ్యాఖ్యల్లో డొల్లతనం బయటపడిందని సాక్షాత్తూ పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొనడం విశేషం. ఇకనైనా, రాష్ట్రాల సహకారంతో ఇలాంటి చావులను నమోదు చేయాలని, వైద్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సరైన వ్యూహాలు రూపొందించుకోవాలని కేంద్రానికి స్థాయీ సంఘం సూచించింది. కొవిడ్ ఉధృతి వేళ ఆక్సిజన్ లభించక చాలామంది రోగులు చనిపోయినా, ఆ వాస్తవాల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్థాయీ సంఘం పేర్కొంది. ప్రభుత్వానికి అసలు సానుభూతే లేదని దీంతో అర్థమైందని, ఆక్సిజన్ ను రాష్ట్రాలకు పంపిణీ చేయడంలోనూ కేంద్రం విఫలమైందని, వెంటిలేటర్లతో ఉన్న బెడ్స్ కూడా అందుబాటులో ఉంచలేకపోయిందని చెప్పింది. ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర మందులకోసం ప్రజలు బారులుతీరి నిరీక్షించడాన్ని మీడియా స్పష్టంగా ప్రచురించినా ప్రభుత్వం కళ్లు తెరవలేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఆక్సిజన్ లేక చనిపోయినా..
ఆక్సిజన్ కొరత కారణంగా చోటుచేసుకున్న మరణాలను నమోదు చేసేందుకు అసలు మార్గదర్శకాలే లేకుండా చేసింది యంత్రాంగం. ఆక్సిజన్ లేక చనిపోయారు అంటే.. కచ్చితంగా దానిపై ఎంక్వయిరీ ఉంటుంది. అందుకే సిబ్బంది చావుకి కారణాలు నమోదు చేయలేదు, కేంద్రం కూడా గుడ్డిగా దాన్నే పరిగణలోకి తీసుకుంది. అనుబంధ ఆరోగ్య సమస్యలు అనే లెక్కలో వాటిని వేసేసింది. ఈ మరణాలపై రాష్ట్రాల సహకారంతో కేంద్రం ఆడిట్ నిర్వహించాలని, ప్రభుత్వ సంస్థల నుంచి మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నామంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది.