దేశంలో 50 కంపెనీల దగ్గు సిరప్‌లలో నాణ్యత లేదు - తేల్చి చెప్పిన సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్
దేశీయంగా ఉత్పత్తి అయిన దగ్గు సిరప్‌లు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణం అయ్యాయన్న నివేదికల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రయోగశాల పరీక్షలలో ఈ విషయం బయటపడింది.
పిల్లలకు కాస్త జలుబు, దగ్గు వచ్చిందంటే వెంటనే తెలిసిన దగ్గు మందు వేసేయటానికి అలవాటు పడిపోయాం. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు అలాంటి పనులు చేయటానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో దగ్గు సిరప్‌లను తయారు చేస్తున్న 50కి పైగా కంపెనీలు నాణ్యతా పరీక్షల్లో విఫలమయ్యాయని ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. దేశీయంగా ఉత్పత్తి అయిన దగ్గు సిరప్‌లు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లల మరణాలకు కారణం అయ్యాయన్న నివేదికల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రయోగశాల పరీక్షలలో ఈ విషయం బయటపడింది.
సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(CDSCO) విడుదల చేసిన నివేదికలో 2,104 పరీక్ష నివేదికల్లో 54 సంస్థల నుండి 128 అంటే ఆరు శాతం మందులు సరైనవి కావని పేర్కొంది. ఫుడ్ అండ్ డ్రగ్ లాబొరేటరీ గుజరాత్ అక్టోబర్ వరకు 20 కంపెనీలు తయారు చేసిన 385 నమూనాలను విశ్లేషించింది, వాటిలో 51ప్రామాణిక నాణ్యత లేనివిగా గుర్తించబడ్డాయి. అలాగే ముంబైకి చెందిన సెంట్రల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీ 10 సంస్థల నుండి 523 నమూనాలను విశ్లేషించింది, వాటిలో 18 నమూనాలు నాణ్యత పరీక్షలలో విఫలమయ్యాయి. చండీగఢ్ రీజినల్ డ్రగ్స్ టెస్టింగ్ లాబొరేటరీ 10 కంపెనీలకు చెందిన 284 పరీక్ష నివేదికలలను విడుదల చేయగా అందులో 23 మందులను నాణ్యత లేనివిగా నిర్ణయించారు. ఘజియాబాద్, కోల్‌కతా ఇలా వివిధ రాష్ట్రాల నుంచి నమూనాలను విశ్లేషించి నివేదికలు విడుదల చేశారు.
కొంతకాలం క్రితం జలుబు, దగ్గు నివారణ కోసం ‘కోల్డ్ అవుట్’ పేరుతో తయారైన సిరప్‌లో మోతాదుకు మించి డైథిలీన్, ఇథలీన్ గ్లైకాల్‌లు ఉన్నాయని, ఇది సురక్షితం కాదని డబ్ల్యూహెచ్ఓ బహిరంగంగా హెచ్చరించింది. అంతకు ముందు భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌లను ఉపయోగించడం వల్ల గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లో 89 మంది చిన్నారులు మృత్యవాతపడ్డారు. దీంతో ఆ సిరప్‌ను సరఫరా చేసిన మరియోన్ బయోటెక్ అనుమతులను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే కామెరూన్‌లో చిన్నారుల మృతికి కారణమైన దగ్గు మందు తయారు చేసిన మధ్యప్రదేశ్‌లోని రీమాన్ ల్యాబ్స్ కూడా సిరప్ తయారీలో నాణ్యత పాటించలేదని విచారణలో తేలింది. ఇందులోనూ మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్ ఉన్నట్లు విశ్లేషణలో తేలింది. ఈ నేపథ్యంలో దగ్గు మందు ఎగుమతులపై కేంద్రం కీలక నిబంధనలు జారీ చేసింది. దగ్గు సిరప్‌లకు ప్రభుత్వ ల్యాబ్‌ల్లో అనుమతి తప్పనిసరి చేసింది. ప్రభుత్వ ల్యాబ్స్ దగ్గు సిరప్‌లను పరీక్షించిన తర్వాత.. తప్పనిసరిగా ఓ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తాయి. ఆ తర్వాతే ఎగుమతులకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది. జూన్ 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియను అమలులో ఉంది.
♦