అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతా.. పెళ్లికొడుకుని చెట్టుకు కట్టేసి చితక్కొట్టిన వధువు కుటుంబీకులు
అతడికి వధువు తరపు వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత బతిమిలాడినా అతడి తీరు మారలేదు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడికే మద్దతుగా నిలిచారు. ఇక ఎంత చెప్పినా వారు వినకపోవడంతో వధువు తరపు కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు.
వరుడు ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చాడు.. అక్కడ పెళ్లి మండపాన్ని చక్కగా ముస్తాబు చేశారు.. బంధువులతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతోంది.. ఇక మరికొన్ని క్షణాలు గడిస్తే వరుడు వధువు మెడలో తాళి కట్టాల్సి ఉంది.. అప్పుడిచ్చాడు వరుడొక ట్విస్ట్.. ఇస్తామన్న కట్నం కంటే అదనంగా కట్నం ఇస్తేనే తాళి కడతానని భీష్మించాడు.. దీంతో వధువు తరఫు కుటుంబ సభ్యులకు చిర్రెత్తుకువచ్చింది. పెళ్ళికొడుకు, అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితక్కొట్టేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది.
ప్రతాప్‌గడ్‌లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన యువకుడు, యువతికి పెళ్లి చేయడానికి పెద్దలు నిర్ణయించారు. పెళ్లి వేడుక కోసం వరుడు తమ ఊరి నుంచి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. కొద్ది క్షణాలు గడిస్తే వధువు మెడలో జయమాల వేయాల్సి ఉంది. అప్పుడు ఉన్నట్టుండి పెళ్ళికొడుకు తనకు అదనపు కట్నం కావాలని వధువు కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. ఇందుకు అంగీకారం తెలిపితేనే వధువు మెడలో జయమాల వేస్తానని చెప్పాడు.
దీంతో అతడికి వధువు తరపు వారు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఎంత బతిమిలాడినా అతడి తీరు మారలేదు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడికే మద్దతుగా నిలిచారు. ఇక ఎంత చెప్పినా వారు వినకపోవడంతో వధువు తరపు కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. పెళ్ళికొడుకు, అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. అదనపు కట్నం డిమాండ్ చేయకపోతే హాయిగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడివి అయ్యే వాడివి కదా బ్రదర్.. ఇప్పుడు అనవసరంగా చిక్కుల్లో పడిపోయావు.. అంటూ నెటిజన్లు తమ సానుభూతి తెలిపారు.