ఈ సారి కర్నాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ గెలుపు ఖాయం: హైదరాబాద్ కు చెందిన సంస్థ‌ సర్వే

రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 108 నుండి 114 సీట్లు, బిజెపి 65 నుండి 75, జెడిఎస్ 24-34 స్థానాలు గెలుచుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది.

Advertisement
Update:2023-01-22 19:24 IST

హైదరాబాద్ కు చెందిన SAS సంస్థ కర్నాటకలో చేసిన సర్వేలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిఖాయమని తేలిపోయింది. ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వే తేల్చింది.

రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 108 నుండి 114 సీట్లు, బిజెపి 65 నుండి 75, జెడిఎస్ 24-34 స్థానాలు గెలుచుకోవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. నవంబర్ 20 నుండి జనవరి 15 వరకు కర్ణాటకలోని IPSS బృందంతో కలిసి హైదరాబాద్‌కు చెందిన SAS గ్రూప్ నిర్వహించిన సర్వేలో, కాంగ్రెస్ తన ఓట్ల వాటాను 38.14 శాతం నుండి 40 శాతానికి (ప్లస్ 1.86%) పెంచుకోవచ్చని పేర్కొంది. అదేవిధంగా బిజెపి 36.35 శాతం నుండి 34 శాతానికి (మైనస్ 2.35%) పడిపోతుంది. జేడీఎస్ కూడా 18.3 శాతం నుంచి 17 శాతానికి (మైనస్1.3 శాతం )పడిపోవచ్చని సర్వే పేర్కొంది. స్వతంత్రులతో సహా ఇతరులు 6 శాతం సాధించవచ్చు. చిన్న పార్టీలు, స్వతంత్రులు ఏడు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా.


బెంగళూరు నగరంలో 13-14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని, బీజేపీ నుంచి కేవలం 9-10 మంది సభ్యులు మాత్రమే ఎన్నికవుతారు. పాత మైసూరు ప్రాంతంలో బీజేపీ 10-14 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 24 నుంచి 25 సీట్లు రావచ్చని, జేడీఎస్‌కు 21 నుంచి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

బెలగావి లేదా కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్‌కు 27 నుంచి 28 సీట్లు, బీజేపీకి 14 నుంచి 16 సీట్లు వస్తాయని అంచనా వేసింది సర్వే. తమకు బలమైన కోటగా ఉన్న కోస్తా కర్ణాటకలో బీజేపీ 12 నుంచి 13 స్థానాల్లో గెలుస్తుందని, కాంగ్రెస్‌కు ఏడు నుంచి ఎనిమిది సీట్లు మాత్రమే రావచ్చని సర్వే తెలిపింది.

హైదరాబాదు-కర్ణాటకలో, బిజెపికి 12 నుండి 14 సీట్లు రావచ్చు, కాంగ్రెస్ 21 నుండి 22 సీట్లు గెలుచుకోవచ్చు. సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్‌కు 16 నుంచి 17 సీట్లు వస్తాయని, బీజేపీకి 8 నుంచి 9 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా. బీఎస్ యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంపై ఓటర్లలో ఆగ్రహం పెల్లుబుకుతున్నందున బీజేపీ చాలా స్థానాల్లో నష్టపోవచ్చని సర్వేలో తేలింది.

వెనుకబడిన, ఎస్సీ/ఎస్టీ, మైనారిటీ వర్గాల నుంచి కాంగ్రెస్‌కు అత్యధిక మద్దతు లభిస్తుందని సర్వే సూచించింది. వొక్కలిగ సామాజిక వర్గం ఎవరికి మద్దతిస్తారనే దానిపై సర్వే చేయగా, 50 శాతం మంది జేడీఎస్‌, 38 శాతం మంది కాంగ్రెస్‌, 10 శాతం మంది బీజేపీకి మద్దతు ఇస్తారని సర్వే పేర్కొంది.

కొప్పల్, గంగావతి, బళ్లారి, కోలార్, దావణగెరె, రాయచూర్‌లలో జనార్దనరెడ్డి కళ్యాణ రాజ్య ప్రగతి పక్షం నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని, ఆ పార్టీ కొన్ని స్థానాలను కూడా గెలుచుకోవచ్చని అంచనా వేసింది. AIMIM పోటీ చేస్తే, అది కేవలం ఆరు నుండి ఏడు స్థానాల్లో మాత్రమే ఓటింగ్ ను ప్రభావితం చేయగలదని పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News