బీజేపీ ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయొద్దు
ప్రజా తీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలు చేయవద్దని కోరినమాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జరిగిన ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలు చేయవద్దని ఆయన అన్నిపార్టీలను కోరారు. లెక్కింపు సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మేం విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నాం. జమ్మూకశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం నేడు తెలుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో పారదర్శకంగా ఉండాలి. ప్రజల తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే వారు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయవద్దు. ఆ పార్టీ ఎలాంటి కుట్రల్లో భాగం కావొద్దు అని వ్యాఖ్యలు చేశారు. గండేర్బల్, బుడ్గామ్ రెండుచోట్లా పోటీపడిన ఒమర్.. రెండుచోట్లా ఆధిక్యంలో ఉన్నారు. ఈరోజు ఆయన ఎక్స్ ఖాతాలో కొన్ని సెల్ఫీలు పోస్ట్ చేశారు. కౌటింగ్ రోజున 7కే రన్ చేశాను. కిందటిసారి సరిగ్గా పూర్తిచేయలేకపోయాను. ఈసారి బాగుంటుంది అనుకుంటున్నాను అనే అర్థంలో ట్విటర్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ 43, బీజేపీ 28, కాంగ్రెస్ 7, పీడీపీ 2 , ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
ఓటమిని అంగీకరిస్తున్నా:ఇల్తీజా ముఫ్తీ
తాను ఓటమిని అంగీకరిస్తున్నట్లు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజా ముఫ్తీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బషీర్ అహ్మద్ చేతిలో ఇల్తీజా ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి దేవేందర్ రానా నగ్రోటాలో ఆధిక్యంలో ఉండగా.. జమ్ముకశ్మీర్ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. కుల్గాంలో సీపీఎం అభ్యర్థి మహమ్మద్ యూసఫ్ ఆధిక్యంలో ఉన్నారు.