జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారు - బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా బీఆర్ఎస్ ఏర్పాటుపై స్పందించారు. కొత్త పార్టీ ప్రకటనపై కేసీఆర్‌కు ఆయన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మారుస్తూ ఈ రోజు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇప్పటికే పార్టీ తీర్మానాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేయడానికి సీనియర్ నేత బి. వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీ ప్రయాణం అయ్యింది. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి, వీకేసీ పార్టీ అధినేత, ఎంపీ తిరుమవలవన్ కూడా జాతీయ పార్టీ ప్రకటన కార్యక్రమానికి హాజరయ్యారు. కేసీఆర్ పార్టీ ప్రకటనతో రాష్ట్రమంతటా టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయి, సంబరాలు చేసుకుంటున్నారు.
కేసీఆర్ జాతీయ పార్టీ వార్త దేశమంతటా దావానలంలా పాకింది. ఇతర పార్టీ నేతల కూడా కేసీఆర్ వేస్తున్న కొత్త అడుగును స్వాగతిస్తున్నారు. ఏ విషయాన్ని అయినా ముఖం మీద చెప్పే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా బీఆర్ఎస్ ఏర్పాటుపై స్పందించారు. కొత్త పార్టీ ప్రకటనపై కేసీఆర్‌కు ఆయన శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ఇప్పటికే తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రంలో టీఆర్ఎస్ బలంగా ఉంది, సీఎంగా కూడా ఉన్నారు. ఇక ఇతరులను కూడా ఐక్యం చేసి తప్పకుండా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్‌లో టీఆర్ఎస్ పార్టీ చేసిన తీర్మానం చేసి ఈసీఐకి పంపుతున్న లేఖను కూడా జత చేశారు. ఓ వైపు బీజేపీ నేతలు బీఆర్ఎస్‌పై ఇష్టానుసారం కామెంట్లు చేయవద్దని అధిష్టానం వారించింది. పార్టీ విధివిధానాలు, ఇతర విషయాలు ఖరారు అయ్యే వరకు అనవసర ఆరోపణలు చేయవద్దని హెచ్చరించింది. కానీ, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేయడం గమనార్హం.