తెలంగాణలో బీజేపీ పోటీలోనే లేదు.. అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

అదానీ వంటి మిత్రుల ద్వారా బీజేపీ భారీ మొత్తంలో ఆర్థిక వనరులను సమకూర్చుకుంటోంది. తద్వారా దేశంలోని మీడియాను నియంత్రిస్తోందని అన్నారు.

Advertisement
Update:2023-09-25 08:12 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుంది. ఆ రాష్ట్రంలో బీజేపీ అసలు పోటీలోనే లేదు. ఎన్నికలకు ముందు బీజేపీ తెలంగాణలో కనుమరుగైపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని ఆయన ధీమాగా చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించనున్నదని.. రాజస్థాన్‌లో కాస్త పోటీ ఉన్నా.. అంతిమంగా తమదే పై చేయి అని చెప్పుకొచ్చారు. ప్రతిదిన్ మీడియా నెట్‌వర్క్ ఆఫ్ అస్సాం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కాంక్లేవ్‌లో రాహుల్ గాంధీ మాట్లాడారు.

కర్ణాటకలో తాము ఏం చేయబోతున్నామో ప్రజలకు ఎలాంటి సామాజిక భద్రత కల్పించబోతున్నామో స్పష్టంగా చెప్పాము. అలా బీజేపీ ఎత్తుగడలను ఆ రాష్ట్రంలో గట్టిగా తిప్పికొట్టామని చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లోనూ ప్రత్యర్థుల ఎత్తుగడలను ఇప్పటికే తిప్పికొడుతున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ కనుమరుగైపోయింది.. ప్రధాన పోటీ అధికార బీఆర్ఎస్‌తో మాత్రమే అని అన్నారు. ఇండియా కూటమి 60 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయని రాహుల్ చెప్పారు.

అదానీ వంటి మిత్రుల ద్వారా బీజేపీ భారీ మొత్తంలో ఆర్థిక వనరులను సమకూర్చుకుంటోంది. తద్వారా దేశంలోని మీడియాను నియంత్రిస్తోందని అన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలో ఒక వైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కుంటూ.. మరో వైపు మీడియా దాడిని ఎదుర్కుంటున్నామని చెప్పారు. మహిళా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు పలికినా వెంటనే అమలు చేయడం లేదు. జనగణన, డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం సంబంధంలో లేని విషయమన్నారు.

దేశవ్యాప్తంగా కులగణన వెంటనే చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనేది సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చే బీజేపీ ఎత్తుగడ అని విమర్శించారు. భారత ప్రభుత్వాన్ని నడిపే 90 మంది ముఖ్య అధికారులు ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే వాళ్లు చాలా బలవంతులు. విధానపరమైన నిర్ణయాలన్నీ వాళ్లే తీసుకుంటారు. ఆ 90 మందిలో కేవలం ముగ్గురే ఓబీసీలు ఉన్నారు. ఇది ఎంతటి దారుణమో ఆలోచించండని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే కులగణన జరిపిస్తామని, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News