బిహార్ సీఎంపైకి దూసుకొచ్చిన బైక్‌లు.. - తృటిలో తప్పించుకున్న నితీశ్ కుమార్
వెంటనే భద్రతా సిబ్బంది బైకర్లను వెంబడించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనాస్థలంలోని సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది పొరబాటున జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. గురువారం ఉదయం నితీశ్ మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం తన ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో.. కొందరు వ్యక్తులు ఆయన భద్రతా వలయాన్ని ఛేదించుకొని.. బైక్‌పై ఆయనకు అత్యంత సమీపంలోకి వచ్చారు. అప్రమత్తమైన నితీశ్ వెంటనే ఫుట్‌పాత్‌పైకి దూకడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ముఖ్యమంత్రి నితీశ్ వాకింగ్ చేసేందుకు తన ఇంటి నుంచి సర్క్యులర్ రోడ్డుకు వెళ్లారు. దీంతో ఆ మార్గంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు రెండు బైక్‌లపై ఆ మార్గంలోకి వచ్చారు. భద్రతా వలయాన్ని దాటుకుని సీఎం నడుస్తున్న వైపు వేగంగా దూసుకొచ్చారు. వీరిని గమనించిన నితీశ్ వెంటనే అప్రమత్తమై రోడ్డు పక్కన ఉన్న ఫుట్‌పాత్‌పైకి దూకడంతో పెను ప్రమాదం తప్పింది.
వెంటనే భద్రతా సిబ్బంది బైకర్లను వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేస్తున్నారు. ఘటనాస్థలంలోని సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది పొరబాటున జరిగిందా లేదా దీని వెనుక ఇంకేదైనా ఉద్దేశం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఎస్ఎస్ఓ కమాండెంట్, పట్నా ఎస్ఎస్పీని నితీశ్ తన ఇంటికి పిలిపించి సమావేశమయ్యారు. ఘటన జరిగిన సర్క్యులర్ రోడ్డులో మాజీ సీఎం రబ్రీ దేవి సహా పలువురు రాజకీయ నాయకుల నివాసాలు ఉన్నాయి.