మెగా డీఎస్సీతో 1.78లక్షల టీచర్ పోస్టుల భర్తీ.. ఏ రాష్ట్రంలో అంటే..!

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీహార్ లో బీఈడీ వంటి కోర్సులు పూర్తిచేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సంతోషంలో మునిగిపోయారు.

Advertisement
Update:2023-05-03 11:56 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో మెగా డీఎస్సీ పేరిట సుమారు 52వేల టీచర్ పోస్టులను భర్తీ చేశారు. అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేయడం అప్పట్లో ఓ రికార్డుగా చెప్పుకున్నారు. ఆ తర్వాత ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, ఇన్ని పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. తక్కువ సంఖ్యలో మాత్రమే పోస్టులను భర్తీ చేశారు.

ఇప్పుడు బీహార్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించాలని సీఎం నితీష్ కుమార్ సారథ్యంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా ఏకంగా 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు.

మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం బీహార్ రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి అని అంటున్నారు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టలేదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బీహార్ లో బీఈడీ వంటి కోర్సులు పూర్తిచేసి టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సంతోషంలో మునిగిపోయారు.

బీహార్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 85,477 ప్రైమరీ టీచర్ పోస్టులు, 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. మెగా డీఎస్సీకి సంబంధించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ సిద్ధార్థ్ తెలిపారు. ఉపాధ్యాయ పోస్టులను బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అతి త్వరలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఏడాది ఆఖరి నాటికి ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన వివరించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ విషయమై ఇప్పటికే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేష‌న్‌ విడుదల కాలేదు. దీంతో నిరుద్యోగులు చాలా కాలంగా నోటిఫికేష‌న్ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News