చర్చలకు బెంగాల్ ప్రభుత్వం పిలుపు.. పెన్‌డౌన్ నిలిపివేసిన 'FAIMA'
చర్చల్లో సామరస్య పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 15 నుంచి సమ్మెను కొనసాగిస్తామని ఎఫ్‌ఏఐఎంఏ ప్రకటన
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు నిలిపివేస్తామని 'ద ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్' (ఎఫ్‌ఏఐఎంఏ) మొదట ప్రకటించింది. బెంగాల్ ప్రభుత్వం చర్చలకు పిలుపురావడంతో పెన్ నిలిపివేస్తామన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. పశ్చిమబెంగాల్ జూనియర్ డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చల సందర్భంగా లేవనెత్తుతామని వెల్లడించింది. అక్కడ సామరస్య పరిష్కారం లభించకపోతే అక్టోబర్ 15 నుంచి సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించింది. ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రం అందిస్తామని స్పష్టం చేసింది.
ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన బెంగాల్ ప్రభుత్వాన్ని కదిపేస్తున్నది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలనే డిమాండ్లతో జూడాలు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు ఆదివారం తొమ్మిదోరోజుకు చేరాయి. వీరి దీక్షలకు మద్దతుగా సోమవారం నుంచి ఎమర్జెన్సీ సర్వీసులు మినహా వైద్య సేవలు నిలిపివేయాలని ఎఫ్‌ఏఐఎంఏ పిలుపునిచ్చింది. జూడాల డిమాండ్లను పరిష్కరించే అవకాశాలను పరిశీలించాలని రాష్ట్రానికి చెందిన సుమారు 30 మంది మేధావులు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వానికి లస్త్రక రాశారు. పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్లకు మద్దతుగా అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే బెంగాల్ ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రావడంతో పెన్ డౌన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు.
క్షీణిస్తున్న డాక్టర్ల ఆరోగ్యం
హత్యాచార ఘటన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లలో పలువురి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చెందిన పులస్త ఆచార్య అనే వైద్యుడు తీవ్ర కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో ఆదివారం రాత్రి అతడిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నామన్నారు.సిలిగురి నగరంలో నిరాహార దీక్ష చేస్తున్న మరో ముగ్గురు జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తరలించామన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని.. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేవరకు నిరాహారదీక్ష కొనసాగుతుందన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న డాక్టర్లలో ఎవరికి ఏం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.