బీజేపీతో జాగ్రత్త..బాబు, నితీష్‌లకు ఆ నేత వార్నింగ్!
అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. ఏపీ, బిహార్ స్పెషల్ స్టేటస్, కేంద్రమంత్రి పదవులను ఇప్పుడే డిమాండ్ చేసి తీసుకోవాలన్నారు. తర్వాత ఇస్తామన్న బీజేపీ హామీలను నమ్మొద్దన్నారు.
కేంద్రంలోని బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో శివసేన ఉద్ధవ్ వర్గానికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ప్రధానంగా మోదీ, అమిత్ షాల ద్వయం తీరుపై శివసేన నేతలకు స్పష్టమైన అవగాహన ఉంది. ఎందుకంటే ఆ పార్టీ అనుభవాలు అలాంటివి. తాజాగా శివసేన ఉద్ధవ్ వర్గం యువనేత ఆదిత్య థాక్రే NDA కూటమిలోని తెలుగుదేశం, జేడీయూలకు కీలక సూచనలు చేశారు.
బీజేపీ విషయంలో టీడీపీ, జేడీయూ అప్రమత్తంగా ఉండాలన్నారు ఆదిత్య థాక్రే. చంద్రబాబు, నితీష్ తమ పార్టీలను రక్షించుకోవాలన్నారు. అందుకోసం స్పీకర్ పదవిని డిమాండ్ చేసి తీసుకోవాలని రెండు పార్టీలకు సూచించారు. తీసుకోవాలన్నారు. లేదంటే త్వరలోనే రెండు పార్టీలను బీజేపీ చీల్చే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇది స్వానుభవంతో చెప్తున్నానన్నారు ఆదిత్య థాక్రే. ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో సొంతంగా మెజార్టీ సాధించని విషయం తెలిసిందే. కేంద్రంలో ప్రధానంగా టీడీపీ, జేడీయూల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలోనే ఆదిత్య థాక్రే రెండు పార్టీలకు ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. ఏపీ, బిహార్ స్పెషల్ స్టేటస్, కేంద్రమంత్రి పదవులను ఇప్పుడే డిమాండ్ చేసి తీసుకోవాలన్నారు. తర్వాత ఇస్తామన్న బీజేపీ హామీలను నమ్మొద్దన్నారు.
మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి సర్కార్‌ను కూల్చిన బీజేపీ.. శివసేనతో పాటు ఎన్సీపీలను రెండు వర్గాలుగా చీల్చిన విషయం తెలిసిందే. శివసేన నుంచి వేరు పడిన ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతేకాదు కోర్టు సైతం పార్టీ గుర్తును షిండే, అజిత్ పవార్ వర్గాలకు కేటాయించడం గమనార్హం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ రెండు వర్గాలు బీజేపీతో కలిసి పోటీ చేశాయి.