కోటాలో నిన్న స్ప్రింగ్ ఫ్యాన్‌లు, ఇప్పుడు బాల్కనీలకి నెట్‌లు
ఇంజినీరింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కోచింగ్ సెంటర్లకు క్యూ కడతారు. కానీ, రాను రాను ఇది సూసైడ్ హబ్‌గా మారిపోతోంది.
రాజస్థాన్‌లోని కోటాలో ఆదివారం మరో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కు చేరింది. పెరుగుతున్న ఆత్మహత్యల నేపథ్యంలో కోచింగ్ ఇన్ స్టిట్యూట్‌లలో నెల రోజుల పాటు పరీక్షలు రద్దు చేయాల్సిందిగా కోటా కలెక్టర్ ఓపీ బంకర్ ఆదేశాలు జారీ చేశారు.
ఒకప్పుడు కోటా అంటే కోచింగ్ హబ్..
ఇంజినీరింగ్, మెడికల్, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ కోచింగ్ సెంటర్లకు క్యూ కడతారు. కానీ, రాను రాను ఇది సూసైడ్ హబ్‌గా మారిపోతోంది. పోటీ ప్రవేశ పరీక్షలకు ప్రసిద్ధి చెందిన కోటా.. ఇప్పుడు ఆత్మహత్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ ఒక్క నెలలోనే ఇప్పటివరకు 5 ఆత్మహత్యల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆత్మహత్యల నిరోధానికి తక్షణ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే హాస్టల్స్‌లో విద్యార్థులకు కౌన్సెలింగ్, యోగా తరగతులు ప్రారంభించింది. వసతి గృహాలు, పీజీలలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఫ్యాన్‌లను స్ప్రింగ్‌లకు బిగించారు. బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో ఇప్పుడు తాజాగా అన్ని హాస్టల్ భవనాలకు వలలు బిగించాలని, ప్రతి ఫ్లోర్ బాల్కనీకి నెట్ లు బిగించాలని జిల్లా యంత్రాంగం హాస్టల్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. 150 కేజీల బరువును సైతం ఆపగలిగే ఈ సూసైడ్ ప్రూఫ్ వలలు బాల్కనీ నుంచి కాకుండా పై అంతస్తు నుంచి దూకినా ఏమీ కాకుండా గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు.
వీటితో పాటు కోచింగ్ సంస్థలు విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, ఒక తరగతి గదిలో 80 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇలాంటి చర్యలు తాత్కాలికంగా ఆత్మహత్యలను నిరోధించగలవేమో కానీ, విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించడం మాత్రమే అసలైన పరిష్కారం.