అదానీ - హిండెన్ బర్గ్ కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

స్టాక్ మార్కెట్లో షేర్ విలువ పెంచుకునేందుకు అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది.

Advertisement
Update:2024-01-03 13:59 IST

అదానీ- హిండెన్‌ బర్గ్‌ వివాదం కేసు విషయంలో అదానీ గ్రూప్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో తీర్పు రిజర్వు చేసిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. అదానీ- హిండెన్‌ బర్గ్‌ కేసులో సెబీ దర్యాప్తును సుప్రీంకోర్టు సమర్థించింది. సెబీ దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సెబీ రెగ్యులేషన్స్‌లో సవరణలు చేయాలని ఆదేశించడానికి, వాటిని నియంత్రించడానికి కానీ సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు.

అలాగే అదానీ కేసులో సిట్ ఏర్పాటు అవసరం లేదని స్పష్టంచేసింది అత్యున్నత ధర్మాసనం. సెబీ ఇప్పటికే 24 ఆరోపణల్లో 22 ఆరోపణలపై విచారణ పూర్తి చేసిందని తెలిపింది. 3నెలల్లోగా మిగిలిన దర్యాప్తు పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది అత్యున్నత ధర్మాసనం.

అలాగే "షార్టింగ్" విషయంలో హిండెన్‌బర్గ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా..? లేదా? అని తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని, సెబీని ఆదేశించింది. వార్తా పత్రికలు, థర్డ్‌ పార్టీ నివేదిక ఆధారంగా సెబీని ప్రశ్నించలేమని తేల్చిచెప్పింది. హిండెన్‌బర్గ్‌ నివేదికను ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చు. కానీ సెబీ దర్యాప్తును అనుమానించడానికి అవి ఆధారాలు కావని సుప్రీంకోర్టు తెలిపింది.

స్టాక్ మార్కెట్లో షేర్ విలువ పెంచుకునేందుకు అదానీ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సెబీ దర్యాప్తున‌కు ఆదేశించింది సుప్రీంకోర్టు. విచారణ జరిపి గత సంవత్సరం నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా సెబీ దర్యాప్తును సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

Tags:    
Advertisement

Similar News