కాంగ్రెస్ వైఖరి తేలేవరకు విపక్షాల భేటీకి రాం.. - తేల్చి చెప్పిన ఆప్
ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ సంకోచిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి అడుగులేయడం ఆప్‌కు కష్టతరమవుతుందని వివరించింది.
ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ తన వైఖరిని బయటపెట్టేంత వరకు భవిష్యత్‌లో జరగబోయే ప్రతిపక్షాల సమావేశాలకు ఆప్ హాజరు కాబోదని ఆ పార్టీ తెగేసి చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్డినెన్స్ అంశంలో కాంగ్రెస్ తన వైఖరి తెలపాలంటూ గురువారం కూడా ఆప్ అల్టిమేటం జారీ చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకోవడంలో కాంగ్రెస్ సంకోచిస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీతో కలిసి అడుగులేయడం ఆప్‌కు కష్టతరమవుతుందని వివరించింది.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ బహిరంగంగా వ్యతిరేకించాలని, అంతేకాకుండా రాజ్యసభలో 31 మంది కాంగ్రెస్ ఎంపీలు ముక్తఖంఠంతో ఆర్డినెన్స్‌ను అడ్డుకోవాలని, అప్పుడే విపక్షాల కూటమిలో ఆప్ భాగస్వామి అవుతుందని తెలిపింది. లేదంటే కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న భావసారూప్య పార్టీలు నిర్వహించే సమావేశాలకు ఆప్ దూరంగా ఉంటుందని స్పష్టం చేసింది.
సమావేశం జరుగుతున్న సమయంలోనూ ఆర్డినెన్స్ అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వైఖరి ఏంటో తెలపాలని కేజ్రీవాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు ఆర్డినెన్స్ విషయంలో బీజేపీతో కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుందని, అందుకే తన నిర్ణయాన్ని తెలిపేందుకు తాత్సారం చేస్తోందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆరోపించారు.
వీటిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. వచ్చే నెలలో సిమ్లాలో జరగబోయే తదుపరి సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఇలాంటి సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కాదని కాంగ్రెస్ మొదట్నుంచీ చెబుతోందని, పార్లమెంట్ వేదికగా వాటిని అడ్డుకోవాలని అంటోందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవించడం, విభేదించడం పార్లమెంట్ వెలుపల జరగవని, పార్లమెంట్ లోపలే అది జరగాలని ఖర్గే వివరించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు అన్ని పార్టీలూ కలిసి చర్చించి ఉమ్మడి నిర్ణయం వెల్లడించాలని చెప్పారు.