జైళ్ళలో 80 శాతం విచారణ ఖైదీలే... విచారణ కోసం ఏళ్ళకేళ్ళు ఎదురు చూపులు
భారతదేశం జైళ్ళు 80 శాతం మంది విచారణ ఖైదీలతో నిండిపోయాయి. విచారణ కోసం ఖైదీలు ఏళ్ళకేళ్ళు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
భారతదేశం జైళ్ళలో 10 మంది ఖైదీలలో 8 మంది విచారణ కోసం ఎదురుచూస్తున్నవారేనని ప్రభుత్వ డేటా తెలిపింది. రోజురోజుకీ జైళ్లలో ఖైదీల సంఖ్య పెరిగిపోతుండడంతో పదింట ఎనిమిది మంది కోర్టు విచారణకు నోచుకోలేక నెలలు, యేళ్ళ తరబడి జైళ్ళలోనే మగ్గాల్సి వస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్‌బి) ప్రచురించిన తాజా జైలు గణాంకాల ప్రకారం, 2021లో ఆక్యుపెన్సీ రేటు 118 శాతం నుండి 130 శాతానికి పెరిగింది. దీంతో దేశంలోని వివిధ జైళ్లలో ప్రతి 10 మంది ఖైదీలలో దాదాపు ఎనిమిది మంది విచారణ కోసం ఎదురుచూస్తున్నారు.
రద్దీని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ జైళ్లు మాత్రం కిక్కిరిసిపోతున్నాయి. దేశంలో అరెస్టుల సంఖ్య 2020లో 1.39 కోట్లు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 1.47 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 7.7 లక్షల అరెస్టులు పెరిగాయి. ఇదే సమయంలో జైళ్లలో ఖైదీల సంఖ్య ఏడాది వ్యవధిలోనే 13 శాతం పెరుగుదలతో 4,88,000 నుండి 5,54,000కి చేరింది. 2021లో జైళ్లలోకి వచ్చే వారి సంఖ్య 10.8 శాతం పెరిగిందని ఆ డేటా తెలిపింది.
డిసెంబర్ 2021 నాటి లెక్కలను పరిశీలిస్తే .. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 19 ప్రాంతాల్లోని జైళ్లు అధిక రద్దీతో నిండిపోయాయి. ఉత్తరాఖండ్ జైళ్ళలో అత్యధికంగా 185 శాతం ఆక్యుపెన్సీ ఉండగా, రాజస్థాన్ జైళ్ళలో 100.2 శాతం ఆక్యుపెన్సీతో తక్కువ స్థాయిలో ఉంది.
పదేళ్ళలో రెట్టింపైన అండర్ ట్రయల్స్ !
ఐజెఆర్ డేటా ప్రకారం..2010లో 2.4 లక్షల అండర్ ట్రయల్ ఖైదీలు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపై సుమారు 4.3 లక్షలకు చేరుకుంది. చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో, అండర్ ట్రయల్ లు ఖైదీలలో 60 శాతానికి పైగా ఉన్నారు. ఢిల్లీలో అయితే 90 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్‌గా ఉన్నారు. దేశ వ్యాప్తంగా 24,000 మంది అండర్ ట్రయల్‌లు మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు జైలులో మగ్గుతుండగా, సుమారు 11,500 మంది ఐదు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నారని డేటా తెలిపింది. చాలా మంది జైలు ఖైదీలు నిరుపేద కుటుంబాల నేపథ్యం నుండి వచ్చినవారే. 25.2 శాతం మంది నిరక్షరాస్యులు కాగా ఖైదీలలో ముస్లింలు, దళితులు, ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారని డేటా వివరించింది.
జైళ్ళ సిబ్బంది లో ఖాళీలు !
దేశంలోని వివిధ జైళ్లలో సిబ్బంది ఖాళీల సంఖ్య కూడా భారీగానే ఉంది. సగానికి సగం రాష్ట్రాలు, యుటీ లలో 25 శాతం ఖాళీలు ఉన్నాయి. 52.3 శాతం ఖాళీలతో సిక్కిం, 59.3 శాతం ఖాళీలతో జార్ఖండ్, 83.1 శాతం ఖాళీలతో లడఖ్‌లు అత్యంత దారుణంగా ఉన్నాయి. మరోవైపు, బీహార్ గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది, 2019లో 66.1 శాతం ఉన్న ఖాళీలను బర్తీ చేసుకుంటూ 2021లో 25.8 శాతానికి ఖాళీల సంఖ్యను తగ్గించుకుంది. ఢిల్లీ,చండీగఢ్‌లు కూడా ఈ విషయంలో బాగా పనిచేశాయి.
అయినప్పటికీ, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్‌లు, కాంపౌండర్‌లతో కూడిన వైద్య సిబ్బంది విషయానికి వస్తే చాలా భయంకరమైన పరిస్థతులుగా కనిపిస్తాయి. ఇక్కడ, ఖాళీలు 2020లో 32.7 శాతం నుండి 2021లో 40.5 శాతానికి పెరిగాయి. గోవాలో 84.6 శాతం, పశ్చిమ బెంగాల్ 66.8 శాతం, కర్ణాటక 61.3 శాతం ఖాళీలతో అధ్వాన్నంగా ఉన్నాయి.
మోడల్ ప్రిజన్ మాన్యువల్ ప్రకారం ప్రతి 300 మంది ఖైదీలకు ఒక డాక్టర్ అవసరం. అయితే, 2021లో సగటున ఒక వైద్యుడు 842 మంది ఖైదీలకు సేవలందించారని ఐజెఆర్ తెలిపింది. ప్రభుత్వాలు పునరావాస దిశలో పటిష్టంగా ముందుకు సాగాలి. మౌలిక సదుపాయాలు, సిబ్బందిని పెంచడం వంటి చర్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అలాగే ఖైదీల రద్దీని కూడా తగ్గించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇండియా జస్టిస్ రిపోర్ట్ చీఫ్ ఎడిటర్ మజా దరువాలా అన్నారు.